విరిగిపడిన కొండచరియలు

ABN , First Publish Date - 2020-10-14T15:48:11+05:30 IST

నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకూ ఏకధాటిగా కురిసిన భారీవర్షానికి..

విరిగిపడిన కొండచరియలు

ఇంద్రకీలాద్రిపై ‘ఓం’ టర్నింగ్‌ వద్ద..

విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌ వద్ద..

రెండు ఇళ్లు ధ్వంసం.. ఒకరి దుర్మరణం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / భవానీపురం): నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకూ ఏకధాటిగా కురిసిన భారీవర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌ సమీపంలోని కొండప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రెండు ఇళ్లు ధ్వంసంకాగా, ఒకరు మృతి చెందారు. ఇంద్రకీలాద్రిపై ‘ఓం’ టర్నింగ్‌ వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లిపడ్డాయి. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నాగేంద్రస్వామి గుడి కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో రెండు ఇళ్లు ధ్వంసం కాగా, తండు శివశంకరరావు(50) అనే వ్యక్తి మృతి చెందాడు. అతని భార్య సుజాత గాయపడింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో టీవీ చూస్తున్న శంకరరావు ఇంటిపై  కొండచరియలు విరిగి పడడంతో అతడు శిథిలాల్లో కూరుకుపోయాడు. సమాచారం అందుకున్న భవానీపురం సీఐ వెంకటేశ్వరరావు, తహసీల్దారు ఎ.మాధురి, ఎస్‌ఐ కవిత, రవీంద్రబాబు హుటాహుటిన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు.


శిథిలాల్లో కూరుకుపోయిన శంకరరావును బయటకు తీసి అంబులెన్స్‌లోకి ఎక్కించేటప్పటికే ప్రాణాలు విడిచాడు. మృతుడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, అనారోగ్యంతో ఐదు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మంత్రి వెల్లంపల్లి ప్రతినిఽధి మైలవరపు దుర్గారావు, వైసీపీ నాయకులు హయాత్‌ షరీఫ్‌, లాజరస్‌ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంత ప్రజలను అక్కడి నుంచి తరలించి దగ్గర్లోని డీసీఎం స్కూల్‌లో పునరావాసం కల్పించారు. గుప్తా సెంటర్‌ మసీదు ఎదురు వీధిలోనూ కొండ చరి యలు విరగడంతో 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు.


ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్‌ వద్ద..

భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై ‘ఓం’ టర్నింగ్‌ వద్ద కొండపై నుంచి పెద్ద పెద్ద బండ రాళ్లు దొర్లుకుంటూ వచ్చి కిందపడ్డాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున మళ్లీ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలను నిలిపివేస్తూ ఈవో సురేశ్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. భక్తులను కనకదుర్గానగర్‌ వైపు నుంచి మహామండపం మెట్ల మార్గం ద్వారా కొండపైకి అనుమతిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో భక్తుల కోసం ఘాట్‌రోడ్లో క్యూలైన్లు నిర్మించారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి వర్షాలు తగ్గకపోతే ఏం చేయాలనే దానిపై దేవస్థానం అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. 

Updated Date - 2020-10-14T15:48:11+05:30 IST