అవస్థల పాలు
ABN , First Publish Date - 2020-03-02T09:47:41+05:30 IST
జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలు 1,40,646 మంది ఉన్నట్లు గుర్తించారు.

విజయవాడ- ఆంధ్రజ్యోతి/కృష్ణలంక : జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలు 1,40,646 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెంటు భూమి చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటే సుమారు 809 ఎకరాలు అవసరంు. ఇంత భూమి విజయవాడ చుట్టుపక్కల లభ్యం కావడం అసాధ్యం. దీంతో రాజధాని కోసం సేకరించిన భూములను పేదలకు పంచాలని ప్రభుత్వం భావించింది.
రాజధాని కోసం వేలాది ఎకరాలను నయాపైసా పరిహారం తీసుకోకుండా త్యాగం చేసిన రైతుల భూములను ఇళ్లు లేని పేదలకు సెంటు భూమి చొప్పున పంచాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు వలంటీర్లు నగరవ్యాప్తంగా తిరుగుతూ ఇళ్లు లేని పేద లబ్ధిదారుల వద్దకు వచ్చి రాజధానిలో ఇళ్ల స్థలం తీసుకోవడం తమకు ఇష్టమేనని కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే, తమకు నగరం నుంచి దూరంగా సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే బదులు నగరం చుట్టుపక్కలే అపార్ట్‌మెంట్లు తరహాలో పక్కా ఇల్లు ఇస్తే బాగుంటుందని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
రాజధాని స్థలాలపై విముఖత ఎందుకంటే..
రాజధాని ప్రాంతంలో స్థలాలు తీసుకునేందుకు అధికశాతం పేదలు విముఖత చూపుతున్నారు. దానికి వారు చెబుతున్న కారణాలు ఏంటంటే..
విజయవాడ నగరం నుంచి రాజధాని ప్రాంతం సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అక్కడ కొంతమేర అభివృద్ధి పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. దీంతో పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించినా వారు ఉపాధి కోసం మళ్లీ 30-40 కిలోమీటర్ల దూరంలోని విజయవాడకో, లేదా దాదాపు అంతే దూరంలో ఉన్న గుంటూరుకో రావాల్సి ఉంటుంది. ఇది తమకు ఆర్థికభారమని పేదలు వాపోతున్నారు.
ఎక్కడా జాగా లేనట్లు రాజధాని కోసం సేకరించిన భూములను తమకు ఇవ్వడం సముచితం కాదని పేదలు అభిప్రాయపడుతున్నారు. కోర్టు వివాదాలు తలెత్తి తమకు ఇచ్చిన స్థలం వివాదంలో పడుతుందని వారు భావిస్తున్నారు. అమరావతి గ్రామాల్లో తమకు స్థలం కేటాయిస్తే అక్కడి రైతుల ఉసురు పోసుకున్నట్లవుతుందని పేర్కొంటున్నారు. ఒకపక్క రాజధాని రైతులు రెండు నెలలుగా దీక్షలు చేస్తూ, తమ భూములు పేదలకు పంచేస్తారా అంటూ అధికారులతో గొడవలు పడుతున్న నేపథ్యంలో.. ఆ వివాదాలకు దూరంగా ఉండటమే మంచిదన్నది మరికొంతమంది భావన.
అధికారులకు, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదం లేని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. పాలకులు రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు తమను బలిపశువులను చేస్తున్నారని ఎక్కువ మంది పేదలు అభిప్రాయపడుతున్నారు.
అంతదూరమా..?.. మోటేపల్లి నాగదుర్గ, 22వ డివిజన్
రాజధాని కోసం రైతులు త్యాగం చేసిన భూముల నుంచి మాకు సెంటు స్థలం ఇస్తామని అంటున్నారు. అలాంటి భూములు మాకక్కరలేదు. వారి ఉసురు మాకు తగులుతుంది. ఎక్కడా భూములు లేనట్టు అంతదూరంలో.. అదీ రాజధాని గ్రామాల్లో ఇస్తామనడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగివుందని అర్థమవుతోంది. అన్ని వసతులు (విద్యుత్, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ) ఉన్నచోట నగర పరిసర ప్రాంతాల్లో ఇస్తే బాగుంటుంది కానీ, ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవడానికి పేదలకు రాజధానిలో సెంటు స్థలం ఇస్తామని నాటకం ఆడుతోంది. రాజధానే లేనిచోట మాకు స్థలాలు ఇస్తే ఉపయోగమేమిటి..?
అక్కడి వరకు వెళ్లలేం.. వెంపల సూరీడు, 24వ డివిజన్, అన్నమ్మ తల్లి గుడిరోడ్డు
రాజధాని గ్రామమైన పిచ్చుకలవారిపాలెంలో సెంటు భూమి కేటాయిస్తారని ఇంటికి వలంటీర్ వచ్చి పేపరుపై సంతకం పెట్టించుకుని ఆధార్ కార్డు కాపీ తీసుకెళ్లారు. ఒకపక్క అక్కడ రైతులకు, అధికారులకు మధ్య గొడవలు జరుగుతుంటే అలాంటి చోట సెంటు భూము కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతుండటంలో ఏదో మతలబు ఉంది. పైగా మా భూములు పేదలకు పంచేందుకు వీల్లేదని రాజధాని రైతులు ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లారని పేపర్లలో, టీవీల్లో చూశాం. అలాంటి వివాదాల్లోకి మాలాంటి పేదోళ్లను లాగడం ఎందుకు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివాదం లేనిచోట స్థలాలు ఇవ్వాలి.
సౌకర్యాలు లేని చోట స్థలమెందుకు..?.. రావార సంతోష్, గంగానమ్మ తల్లి గుడి రోడ్డు, కృష్ణలంక
రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వసతి వంటివి ఉన్న ప్రాంతాల్లో నగరానికి కొంచెం దూరంగా ఉన్నా వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ అసలు రాజధానే ఉండదని చెబుతున్నారు. అలాంటి చోట ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తామని చెబుతోంది. పిచ్చుకలవారిపాలెంలో బీడువారిన భూముల మధ్య సెంటు స్థలం ఇస్తే మేం ఏమి చేసుకోవాలి. పనుల కోసం మళ్లీ విజయవాడ రావాల్సిందే. దానివల్ల మాలాంటోళ్లకు ఏం ఉపయోగం ఉండదు. పోనీ అక్కడే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కూడా కట్టించి ఇస్తే ఆలోచిస్తాం.