మంత్రి పేరు చెబుతూ.. చెలరేగిపోతున్న బుజ్జిబాబు!
ABN , First Publish Date - 2020-12-31T05:24:06+05:30 IST
ఈ బుజ్జిబాబు చెప్పిందే ఇప్పుడు వీఎంసీలో శాసనం. ఉన్నతాధికారులు సైతం..

ఆరగింపులు.. ‘బుజ్జి’గింపులు
కార్పొరేషన్‌లో మంత్రి అనుచరుడి అక్రమాలు
ఉన్నతాధికారుల కారుల్లో షికార్లు
ఆయన చెప్పిందే వేదం
దొంగ మస్తర్లతో దోచేస్తున్న వారికి వత్తాసు
కేసు పెట్టకుండానే ఫైలు మూసేసిన అధికారులు
దొంగ మస్తర్లకూ బిల్లులు చెల్లించాలని మంత్రి పీఏతో ఒత్తిడి
ప్రతినెలా అరకోటికిపైగా స్వాహా
విజయవాడ, ఆంధ్రజ్యోతి: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఇప్పుడంతా విజయవాడ బుజ్జిబాబు కార్పొరేషన్‌గా పిలుస్తున్నారు. మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ బుజ్జిబాబు చెప్పిందే ఇప్పుడు వీఎంసీలో శాసనం. ఉన్నతాధికారులు సైతం జీ..హుజూర్ అనాల్సిందే. అధికారుల కేబిన్లలోకి వెళ్లి గంటలకు గంటలు మంతనాలు జరిపేస్తారు. అధికారిక కార్లలోనే షికార్లు చేసేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు తెలియకుండా వీఎంసీలో చీమ కూడా కదలదు. ఏ పనికి ఎంత వసూలు చేయాలి, ఏ అధికారికి ఎంత వాటా ఇవ్వాలి.. అన్నీ బుజ్జిబాబే నిర్ణయిస్తాడు. మంత్రి పేరు చెబుతూ వీఎంసీని అడ్డగోలుగా దోచేస్తున్న ఈయన ముఠాపై వీఎంసీలో కిందిస్థాయి అధికారులు మండిపడుతున్నారు.
కార్పొరేషన్‌లో బోగస్ మస్తర్లతో నిధులు స్వాహా చేయడం ఎప్పటినుంచో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దోపిడీ పదింతలు పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం బుజ్జిబాబు ఆధ్వర్యంలో దొంగ మస్తర్ల ముఠాలు పనిచేస్తుండటం. తాజాగా అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసి రూ.10లక్షల దోపిడీకి సిద్ధమైన కాంట్రాక్టర్ గుట్టురట్టవ్వడంతో బుజ్జిబాబు ముఠా ఆగడాలు వీఎంసీలో చర్చనీయాంశమయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో కార్పొరేషన్ పరిధిలోని మలేరియా డివిజన్లలో కాంట్రాక్టు వర్కర్లను సరఫరా చేసే బాధ్యతను ఓ మహిళా కాంట్రాక్టర్ దక్కించుకుంది. బుజ్జిబాబు ఆశీస్సులు ఉండటంతో అడ్డగోలు దోపిడీకి తెరదీసిందామె. ఇందులో భాగంగా మలేరియా డివిజన్లలో వర్కర్లను సరఫరా చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించింది. బోగస్ మస్తర్లతో రూ.9.50 లక్షలకు బిల్లు తయారు చేసింది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది. ఈ ఫైలుకు ప్రజారోగ్య శాఖ, అకౌంట్స్ విభాగాలు ఆమోదముద్ర వేశాయి. ఈలోగా వాటాల వద్ద తేడా రావడంతో ఫోర్జరీ సంతకం గుట్టురట్టయింది. విచారణ జరిపిన సీఎంహెచ్‌వో ఫైలును నిలిపేశారు. ఫైలుపై సంతకం తనది కాదని సీనియర్ మెడికల్ ఆఫీసర్ స్పష్టం చేశారు.
దీంతో ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈలోగా సీన్ రివర్స్ అయింది. బుజ్జిబాబు ఒత్తిడితో అధికారులు వెనక్కు తగ్గారు. డైరెక్టుగా మంత్రి పీఏతో అధికారులకు బెదిరింపు ఫోన్లు చేయించిన బుజ్జిబాబు.. కాంట్రాక్టర్‌పై ఎలాంటి కేసు పెట్టకుండా చూశారు. పైగా దొంగ మస్తర్లతో పెట్టిన ఫైలును ఓకే చేసి బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి ప్రారంభించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే ఆషా మాషీ వ్యవ హారం కాదు. కానీ, మంత్రి కారణంగా అధికారులు ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయకుండా మిన్నకుండి పోయారు. ఈ దొంగ మస్తర్ల వ్యవహారంలో మహిళా కాంట్రాక్టర్‌కు ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సహకారం అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. మలేరియా డివిజన్లలో 142 మంది వర్కర్లను సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్న మహిళా కాంట్రాక్టర్ కేవలం 35 మంది వర్కర్లనే సరఫరా చేసినట్లు సమాచారం. దీనికి ఆమెకు రూ.2 లక్షలే చెల్లించాలి. కానీ, ఆమె రూ.9.5 లక్షలకు బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రతినెలా బుజ్జిబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దొంగ మస్తర్ల వ్యవహారంలో సుమారు రూ.అరకోటి వరకు వీఎంసీ నిధులు స్వాహా అవుతున్నట్లు సమాచారం.
పారిశుధ్య విభాగంలో కంత్రీమేస్త్రి
కార్పొరేషన్‌లో అతనొక శానిటరీ వర్కర్. 17 ఏళ్ల క్రితం సాదాసీదా ఉద్యోగి. అందరితో పాటు పనిచేసి నెల జీతం అందుకుని వెళ్లేవాడు. నేడు అతను పనిచేసే విభాగంలో అతనే కింగ్. తాను విధులు నిర్వహించే శానిటరీ డివిజన్‌ను శాసిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. పాయకాపురం పరిధిలోని 62వ డివిజన్ శానిటరీ విభాగంలో సుమారు 90 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 9 మంది పర్మినెంట్ ఉద్యోగులు. వివిధ కారణాలతో 90 మందిలో సుమారు 25 మంది వరకు రోజువారీ పనులకు హాజరుకారు. వీరికి అతనే ఫోన్‌చేసి పిలిపించి మస్తర్ వేయించి పంపేస్తారు. ఆ తర్వాత వారి జీతాల్లో వాటాలు తీసుకుంటాడు. ఎంతో పకడ్బందీగా పెట్టిన మస్తర్ విధానాన్ని కూడా బురిడీ కొట్టించగల కంత్రీగా ఈ శానిటరీ వర్కర్ పేరొందారు. పర్మినెంట్ సిబ్బంది నుంచి రూ.10వేల నుంచి రూ.15వేలు, డ్వాక్రా, సీఎంఈవై గ్రూపు సభ్యుల నుంచి రూ.5వేల నుంచి రూ.7వేల వరకు వసూలు చేస్తుంటాడు. నగరవ్యాప్తంగా ఇలాంటి తంతు చాలా డివిజన్లలో జరుగుతోంది.
సహకరించని వారికి వేధింపులు
తనకు సహకరించే వారి విషయంలో ఓ రకంగా, సహకరించని వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తుంటాడీ కంత్రీమేస్త్రి. విధులకు సమయానికే వెళ్లినా సమయం దాటిందంటూ మస్తర్ వేయనీకుండా అడ్డుకోవడం, అత్యవసర సమయాల్లో సైతం సెలవులు మంజూరు చేయకపోవడం వంటివి చేస్తుంటాడు. సెలవు కావాలంటే ఈయనకు రోజుకు రూ.500, వారానికి రూ.10వేలు సమర్పించుకోవాలి. ఇలా నెలకు రూ.లక్ష వరకు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఈయనకు స్థానిక ప్రజాప్రతినిధి అండ ఉండటంతో ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు.