-
-
Home » Andhra Pradesh » Krishna » vijayawada cpm protest
-
ఆస్తి, నీరు, డ్రైనేజీ పన్నులకు వ్యతిరేకంగా సీపీఎం ధర్నా
ABN , First Publish Date - 2020-11-25T17:29:06+05:30 IST
ఆస్తి, నీరు, డ్రైనేజీ పన్నులను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీపీఎం ధర్నాకు దిగింది.

విజయవాడ: ఆస్తి, నీరు, డ్రైనేజీ పన్నులను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం సీపీఎం ధర్నాకు దిగింది. పన్నుల భారాలను నిరసిస్తూ వినూత్న రీతిలో ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీలను సీపీఎం నేతలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబురావు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని విమర్శించారు. పట్టణ సంస్కరణల పేరుతో పన్నులను పెంచడం దుర్మార్గమన్నారు. కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. కేంద్రం చెప్పినట్లుగా నడుస్తూ పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ఒకే రోజు మూడు జీవోలు జారీ చేసి ఆస్తి, నీరు, డ్రైనేజీ పన్నులను పెంచారన్నారు. ఏప్రిల్ నుంచి ప్రజలు పదింతలు ఎక్కువుగా ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందని.. ఈ పన్నుల భారాన్ని తగ్గించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తామని బాబూరావు స్పష్టం చేశారు.
దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వానికి జగన్ తాబేరులా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పది రెట్లు పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపడం అన్యాయమన్నారు. పట్టణ ప్రాంతాలలో పేద, మధ్యతరగతి ప్రజలు నివసించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రం కోట్లు దోచి పెడుతున్న ప్రభుత్వాలు సామాన్యులపై భారాలు మోపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలను వెంటనే ఉపసంహరించు కోవాలని దోనేపూడి డిమాండ్ చేశారు.