విజయవాడలో ఏఐకేఎస్‌సీసీ ధర్నా...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-11-27T17:56:09+05:30 IST

కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టం, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 20, 22లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.

విజయవాడలో ఏఐకేఎస్‌సీసీ ధర్నా...ఉద్రిక్తం

విజయవాడ: కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టం, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 20, 22లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష కోఆర్డినేషన్ కమిటీ  ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘాలు, వామపక్షాల నేతలు... కేంద్ర కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. కాగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.




ఈ సందర్భంగా ఏఐకేఎస్‌సీసీ చైర్మన్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ...కేంద్రం రూపొందించిన వ్యవసాయం చట్టం దుర్మార్గమని మండిపడ్డారు. మోదీ చెప్పినట్లుగా జగన్ నడుస్తూ..  రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.  శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని అన్యాయంగా అడ్డుకున్నారని అన్నారు. ప్రజల హక్కులను హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చట్టాలను, జీవోలను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కర్షకులు, ప్రజల ప్రయోజనాలను .. కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని వడ్డేశోభానాద్రీశ్వరరావు తేల్చిచెప్పారు.  





సీపీఎం నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... కేంద్రం ఏకపక్షంగా రైతులకు నష్టం చేసేలా వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. ఆ చట్టాల వల్ల కార్పోరేట్ శక్తులకు మేలు తప్ప... కర్షకులకు ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా వాటిని బలపరుస్తూ జీవోలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాలను ఉపసంహిరంచుకోవాలని ఉమామహేశ్వరావు డిమాండ్  చేశారు. 

Updated Date - 2020-11-27T17:56:09+05:30 IST