జిల్లాలో 127కు చేరిన బాధితులు
ABN , First Publish Date - 2020-04-26T09:11:39+05:30 IST
జిల్లాలో శనివారం ఉదయానికి 25 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొనగా, సాయంత్రానికి మరో 50 కలిశాయి.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శనివారం ఉదయానికి 25 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొనగా, సాయంత్రానికి మరో 50 కలిశాయి. ఇందులో జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలో ఒక మహిళకు, నూజివీడు క్వారంటైన్ సెంటరులో ఉన్న ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, మిగిలిన కేసులన్నీ విజయవాడ నగర పరిధి, చుట్టుపక్కల ప్రాంతాల్లోవే. పెనమలూరు మండలంలోని సనత్‌నగర్‌లో ఒకరికి, చోడవరంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
చోడవర ంలో ఈనెల 17వ తేదీన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా అతని తల్లి, ఇద్దరు మేనల్లుళ్లు, ఇంట్లో పని మనిషికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కానూరు పంచాయతీ పరిధిలోని సనత్‌నగర్‌లో 30 సంవత్సరాల యువకుడికి పాజిటివ్ వచ్చింది. పెనమలూరు మండలంలో శనివారం ఒక్కరోజే ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. గూడవల్లిలో ఆరుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో కలకలం మొదలైంది.
ఎక్కడెక్కడంటే..
కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్న కార్మికనగర్, కృష్ణలంకల్లో శనివారం భారీగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణలంకలో శనివారం సాయంత్రం వరకు 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కార్మికనగర్‌లో ఆ సంఖ్య 30కి చేరింది. మధురానగర్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక్కడ పసుపుతోటలో ఒకరికి, కొబ్బరితోటలో పద్నాలుగేళ్ల బాలుడికి, మరో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వీరిలో ఒక మహిళా వార్డు వలంటీర్ ఉన్నారు. ఈనెల 16న ఆమె ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు సమాచారం.
నగరంలోని సుమేధ భవన్ ప్రాంతంలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. కేదారేశ్వరపేట, ఖుద్దూస్‌నగర్, విద్యాధరపురం, రామవరప్పాడులోని పింగళి వెంకయ్య వీధి, గీతామందిర్, గాంధీనగర్, సీతన్నపేట దత్తువారివీధి, గులాబీతోట ప్రాంతాల్లోనూ కేసులు బయటపడ్డాయి. అయితే, వీరంతా విదేశాలకు వెళ్లినట్టు గానీ, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారితో గానీ, వారితో కాంటాక్ట్ అయినట్టు గానీ ఆధారాల్లేవు. సామాజిక వ్యాప్తి ద్వారానే సోకినట్లు స్పష్టమవుతోంది.
వ్యక్తి మృతి
కృష్ణలంకకు చెందిన వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. కరోనా లక్షణాలతో బాధపడుతూ కొవిడ్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లిన ఆ వ్యక్తి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని మృతదేహం నుంచి శాంపిల్స్‌ను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా, శనివారం రిపోర్టులు వచ్చాయి. ఆ వ్యక్తి కరోనా కారణంగానే మరణించినట్లు ఆసుపత్రి అధికారులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా వైద్య సిబ్బందే కృష్ణలంక విద్యుత్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశారు.
కొవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగిని తాతయ్య కరోనా లక్షణాలతో బాధపడుతూ రెండు రోజుల క్రితం చనిపోయారు. ఈయన మనవరాలైన ఆసుపత్రి ఉద్యోగిని కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి మాచవరంలోని ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నారని తెలిసింది. కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.