లాక్‌బ్రేక్‌.. పోలీసులు మరింత సీరియస్‌

ABN , First Publish Date - 2020-04-08T10:05:36+05:30 IST

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి 15 రోజులు పూర్తయ్యింది. మరో వారంపాటు మరింత కచ్చితంగా లాక్‌డౌన్‌ను పాటిస్తే

లాక్‌బ్రేక్‌.. పోలీసులు మరింత సీరియస్‌

నగరంలోని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ

ఆటోలు, ద్విచక్రవాహనాల సీజ్‌

పరిస్థితిని పరిశీలించిన పోలీసు కమిషనర్‌


గంగూరుకు చెందిన వ్యక్తి ఇద్దరు మహిళలతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బందరు రోడ్డులో వస్తుండగా బెంజ్‌సర్కిల్‌ చెక్‌పోస్టు దగ్గర పోలీసులు ఆపారు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే నక్కల్‌రోడ్డులోని మందుల దుకాణానికి వెళ్తున్నానని చెప్పారు. వెనుక ఇద్దరు మహిళల గురించి అడితే లిఫ్ట్‌ ఇచ్చానని చెప్పాడు. దీంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. బైక్‌ తాళాలు లాక్కుని, వాహనాన్ని సీజ్‌ చేశారు.


నలుగురు యువకులు రెండు యాక్టివా వాహనాలపై ముందు ఖాళీ సంచులను పెట్టుకుని బయలుదేరారు. పోలీసులు ఆపితే మెడలో ఉన్న ఆహార పంపిణీ గుర్తింపు కార్డులను చూపించారు. మెడలో కార్డులున్నా సంచులు ఖాళీగానే ఉన్నాయి. రెండు సంచుల్లో ఆహారాన్ని పంపిణీ చేయడానికి నలుగురు బయటకు అవసరమా? పంపిణీ చేయడానికి వచ్చారా? పని లేకుండా తిరగడానికి బయటకు వచ్చారా? అంటూ పోలీసులు వారికి క్లాస్‌ తీసుకున్నారు. 


ఆంధ్రజ్యోతి - విజయవాడ : లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి 15 రోజులు పూర్తయ్యింది. మరో వారంపాటు మరింత కచ్చితంగా లాక్‌డౌన్‌ను పాటిస్తే పరిస్థితిలో చాలా వరకు మార్పు రావొచ్చు. ఇదీ అధికారుల అభిప్రాయం. కానీ నగరంలో కొద్దిరోజులుగా పరిస్థితి చూస్తుంటే మాత్రం లాక్‌డౌన్‌ కట్టు తప్పినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాహనాలపై బయటకు వచ్చిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మంగళవారం రహదారులపైకి అకారణంగా వచ్చిన వారికి చుక్కలు చూపించారు. నగరంలో ఏర్పాటు చేసిన అన్ని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు కఠినంగా వ్యవహరించారు. సహేతుకమైన కారణాలతో బయటకు వచ్చిన వారిని మాత్రమే వదిలిపెట్టారు. మిగిలినవారి వాహనాలను సీజ్‌ చేశారు. ఆ వాహనదారులకు జరిమానాలు విధించారు. పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు కమిషనరేట్‌ పరిధిలోని ప్రాంతాలను పరిశీలించారు.


‘చిల్లర’ సాకులు

రహదారులపైకి వస్తున్న వాహనదారులు చెబుతున్న సాకులు పోలీసుల్లో హీట్‌ను పెంచుతున్నాయి. వారు చెప్పే సమాధానాలు చిర్రెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు చూపించో, మందుల షాపుల పేర్లు చెప్పో కళ్లు గప్పిన వారికి పోలీసులు గట్టిగానే పట్టుకుంటున్నారు. ముఖ్యంగా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశారు. ఆహారం పంపిణీ చేసే ముసుగులోనే ఎక్కువగా బయటకు వస్తున్నారని గుర్తించారు. ఇలా పంపిణీచేసే వాళ్లంతా బెంజ్‌సర్కిల్‌ ప్రాంతాన్ని లక్ష్యం చేసుకుంటున్నారు. కారులు, ద్విచక్రవాహనాలు, గూడ్స్‌ వ్యానుల్లో నలుగురైదుగురు వచ్చేస్తున్నారు. అనాథలంతా ఇక్కడికి పరుగులు తీసుకుంటూ రావడంతో ఇక్కడంతా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. దీనికి బుధవారం నుంచి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన పాతబస్తీలో ఆటోలు యథేచ్చగా తిరిగేస్తున్నాయి. పోలీసులు ఉదయం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నిత్యావసరాలకు సంబంధం లేకుండా రహదారులపైకి వచ్చిన ఆటోలను సీజ్‌ చేశారు. ఈ వారం పాటు ఆహారం పంపిణీ చేసే వాహనాలనూ నియంత్రించాలని పోలీసులు భావిస్తున్నారు.


లాక్‌డౌన్‌ బ్రేకర్లపై 1089 కేసులు

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన వ్యాపారులపైన, రహదారులపైకి వచ్చిన వ్యక్తులపైన పోలీసులు మంగళవారం మొత్తం 1089 కేసులు నమోదు చేశారు. 33 దుకాణాలు, 37 మంది వ్యక్తులపై 27 కేసులు నమోదు చేశారు. ఇది కాకుండా 1066 వాహనదారులపై ఎంవీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి రూ.4లక్షల 36వేల 560 జరిమానా విధించారు.

Updated Date - 2020-04-08T10:05:36+05:30 IST