‘వీరులపాడు మండల కేంద్రాన్ని మారిస్తే ఆమరణ దీక్షే’

ABN , First Publish Date - 2020-12-07T01:59:45+05:30 IST

మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడేది లేదని మండల పోరాట కమిటీ నాయకులు...

‘వీరులపాడు మండల కేంద్రాన్ని మారిస్తే ఆమరణ దీక్షే’

వీరులపాడు మండల పోరాట కమిటీ నాయకుల హెచ్చరిక

వీరులపాడు: మండల కేంద్రాన్ని వీరులపాడు నుంచి తరలిస్తే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడేది లేదని మండల పోరాట కమిటీ నాయకులు వట్టికొండ చంద్రమోహన్‌, వాసిరెడ్డి రమేష్‌ హెచ్చరించారు. వీరులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులతో మండల పోరాట కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల కేంద్ర తరలింపు అప్రజాస్వామికమని మండల కేంద్ర తరలింపు యోచనను అధికారులు, పాలకులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 1985 నుంచి వీరులపాడు మండల కేంద్రంగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉందని, అటువంటప్పుడు హడావుడిగా మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మార్చటంలో ఉన్న ఆంతర్యమేమిటో తెలపాలని ప్రశ్నించారు.


వీరులపాడు మండల కేంద్రానికి నాలుగు రహదారులున్నాయని చెప్పారు. వీరులపాడు మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎర్రుపాలెం రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో మధిర రైల్వే స్టేషన్ ఉన్నాయని గుర్తుచేశారు. మండల కేంద్ర తరలింపును నిరసిస్తూ చేసే పోరాటానికి ఆర్ధిక సహకారమందిస్తానని గ్రామానికి చెందిన వాసిరెడ్డి రమేష్‌ సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు పాటిబండ్ల జయపాల్‌, గువ్వల సత్యనారాయణ, నాగవరపు శ్రీనివాసరావు, దొడ్డా వాసు, దేవరకొండ శ్రీనివాసరావు, కొమ్మినేని వెంకటపతిరావు, కృష్ణ పాల్గొన్నారు.

Read more