ఓటర్ల జాబితాల క్లైమ్‌లు వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-02-08T11:04:59+05:30 IST

ఓటర్ల జాబితాలకు సంబంధించిన క్లైమ్‌లను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు డాక్టర్‌ జి.వాణీమోహన్‌ అధికారులను ఆదేశించారు.

ఓటర్ల జాబితాల క్లైమ్‌లు వెంటనే పరిష్కరించాలి

 జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు జి.వాణీమోహన్‌



గవర్నర్‌పేట, ఫిబ్రవరి 7: ఓటర్ల జాబితాలకు సంబంధించిన క్లైమ్‌లను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు డాక్టర్‌ జి.వాణీమోహన్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2020 అమలుపై ఆర్వోలు, ఏఆర్వోలు, ఎలక్షన్‌ డీటీలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఓటర్ల సవరణ కార్యక్రమం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఓటర్ల జాబితాలో పోలింగ్‌ రోజున పేరు లేదనే ఫిర్యాదు ఏ ఒక్కరి నుంచీ రాకుండా తుది జాబితాను పక్కాగా రూపొందించాలని సూచించారు.


పోలింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు ఓటు వినియోగించుకునేలా ర్యాంపులు, మూడు చక్రాల సైకిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 11వ తేదీ నాటికి అనుబంధ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, 14 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆమె ఆదేశించారు. 


ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌

కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 35,80,209 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే విద్యుత్‌, తాగునీరు, ర్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 600 ట్రై సైకిళ్లు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి పి.ప్రసాద్‌, ఆర్వోలు, ఏఆర్వోలు, ఎలక్షన్‌ డీటీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T11:04:59+05:30 IST