రవాణా లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-04-15T09:31:06+05:30 IST

లాక్‌డౌన్‌ కొనసాగింపుతో మంగళవారం మధ్యాహ్నం నుంచి..

రవాణా లాక్‌డౌన్‌!

రిజర్వేషన్ల రద్దు! ఆటో రిఫండ్ షురూ!

ప్రయాణికులకు రద్దు మెసేజ్‌లు, బ్యాంకు క్రెడిట్ మెసేజ్‌లు

మధ్యాహ్నం నుంచి రైల్వే, విమానయాన సంస్థల నిర్ణయం

చిక్కుకుపోయిన వారు గమ్యస్థానాలకు చేరుకునేదెలా?

పెనుసంక్షోభంలో ప్రజా రవాణా రంగం..

ఆర్టీసీ, రైల్వే, విమానయానాలకు రూ.151 కోట్ల ఆదాయం హుష్


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): లాక్‌డౌన్‌ కొనసాగింపుతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రైల్వే, విమానయాన సంస్థలు రిజర్వేషన్లను రద్దు చేసి పూర్తి టిక్కెట్‌ డబ్బులను ప్రయాణికుల బ్యాంకు ఖాతాలలోకి ఆటో రిఫండ్‌ చేయటం ప్రారంభించాయి. లాక్‌ డౌన్‌కు కొనసాగింపుగా ప్రజా రవాణా స్తంభన కూడా యథావిధిగా కొనసాగబోతోంది. రోడ్డు, రైల్వే, విమానయానాలన్నీ మే 3 వరకు ఎక్కడి వక్కడే ఆగిపోనున్నాయి. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఇప్పటికే రిజర్వేషన్లను రద్దు చేసి ఆటో రిఫండ్‌ చేస్తుండగా.. చివరి వరకు ఎదురు చూసిన రైల్వే, విమానయాన శాఖలు మంగళవారం మధ్యాహ్నం రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల కోసం ఎదురు చూడకుండానే.. లాక్‌‌డౌన్‌ను కొనసాగించాలని సంబంధిత శాఖలు నిర్ణయం తీసుకున్నాయి.


విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులతో పాటు, విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులు మే 3 వరకు రిజర్వేషన్ల రద్దుతో పాటు, ఆ తర్వాత కూడా ఎంలాంటి ఆదేశాలు లేకుండా ముందస్తుగా అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లన్నీ రద్దు అయిపోతున్నాయి. రైళ్లు, ఫ్లైట్స్‌ అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ కోసం ఆన్‌లైన్‌ ఒక్కదానినే అందుబాటులో ఉంచారు. దీంతో రిజర్వేషన్ల రద్దు కారణంగా ఎలాంటి లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు జరిగే అవకాశం లేదు. ఆన్‌‌లైన్‌ అడ్వాన్స్‌ రిజర్వేషన్లను రద్దు చేయటం ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారి బ్యాంకు ఖాతాలలో పూర్తిస్థాయిలో డబ్బులు ఆటో రిఫండ్‌ అవుతున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రతి ప్రయాణికుడి ఫోన్‌కు రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్టు సందేశాలు వస్తున్నాయి.


ఆ తర్వాత తమ బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ అయినట్టు కూడా మెసేజ్‌లు వస్తున్నాయి. ఏప్రిల్‌ 14 తర్వాత రవాణాకు సడలింపులు ఉంటాయన్న ఉద్దేశంతో ఆర్టీసీ, రైల్వే, విమానయాన శాఖలు ఏప్రిల్‌ 15 నుంచి ముందుస్తు రిజర్వేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఆర్టీసీ మాత్రం ఏసీ బస్సులు కాకుండా మిగిలిన హై ఎండ్‌ బస్సులన్నింటికీ రిజర్వేషన్‌ కల్పించింది. రైల్వే, విమానయాన సంస్థలు మాత్రం అన్ని రకాల రైళ్లు, విమానాలలో బుకింగ్‌కు అవకాశం కల్పించాయి. ప్రయాణికుల నుంచి కూడా ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఏ స్థాయిలో డిమాండ్‌ వచ్చిందంటే లాక్‌డౌన్‌ ముందు పడిపోయిన ఛార్జీల కంటే నాలుగైదు రెట్ల మేర ఛార్జీలు పెరిగాయి. దాదాపుగా బస్సులు, రైళ్లు, విమానాలకు హౌస్‌ఫుల్‌ రిజర్వేషన్‌ జరిగింది. 


గమ్యస్థానాలకు చేరుకునేదెలా? 

లాక్‌డౌన్‌కు ముందు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు భారీ సంఖ్యలో ఉండటంతో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు. వీరు తమ గమ్యస్థానాలకు  చేరుకోవటం ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు లాక్‌డౌన్‌ కారణంగా పలు చోట్ల అద్దెకు ఉంటున్నవారు, హాస్టళ్లలో ఉంటున్నవారు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ఇతర పరిశ్రమల పని ప్రదేశాలలోనే నివశిస్తున్నవారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వలస కూలీలు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా గమ్య స్థానాలకు చేరుకోవటం గగనంగా మారుతోంది.


దీంతో ఏప్రిల్‌ 14 ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కట్టుకుని మరీ ఎదురు చూశారు. కరోనా మహమ్మారి ఇంకా వదలకపోవవటం, తీవ్రత మరింతగా ఉండటంతో లాక్‌డౌన్‌ కొనసాగక తప్పలేదు. ఆర్థిక పరిస్థితుల కంటే ప్రాణమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావించటంతో లాక్‌డౌన్‌ను కొనసాగించక తప్పలేదు. ఇపుడు వీరంతా ఎలా చేరుకుంటారన్నదే ప్రశ్న! అన్నింటికంటే వలస కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. వీరు సొంతూళ్లకు ఎలా చేరుకుంటారన్నదే ప్రశ్న! 


పెను సంక్షోభంలో రవాణా రంగం

ప్రజా రవాణాలో కీలక భూమిక వహిస్తున్న రోడ్డు, రైలు, విమాన రవాణా రంగాలు తీవ్ర సంక్షోభంలోకి పయనించబోతున్నాయి. ఇప్పటికే ఆయా రంగాలు భారీ నష్టాలలో పయనిస్తున్నాయి. ఆంధ్రజ్యోతికి అందిన తాజా సమాచారం మేరకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ ఈ 25 రోజులలో అక్షరాలా రూ.38 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. కోల్పోయిన ఆదాయంలో 99శాతం మేర ఆపరేషనల్‌ విభాగంలో అయితే ఒక శాతం లాజిస్టిక్స్‌ విభాగంలో ఉంది. విజయవాడ రైల్వే డివిజన్‌ అయితే మార్చి 31 నాటికి రూ. 47.24 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.


విజయవాడ డివిజన్‌ పరిధిలోనూ, మీదుగానూ వెళ్లే 127 ప్రయాణికుల రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇక విమానయానం విషయానికి వస్తే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతి రోజూ 44 ఆపరేషన్స్‌ జరుగుతుంటాయి. రోజుకు అన్ని విమానాలలోనూ 2916 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి, కడపలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సగటున సీటింగ్‌కు రూ. 9వేల చొప్పున లెక్కిస్తే రోజుకు రూ. 2.62 కోట్ల మేర ఆయా విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి.


ఈ లెక్కన 25 రోజులకు రూ.65.61 కోట్ల మేర విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోయాయి. ఓవరాల్‌గా మూడు ప్రజా రవాణా సంస్థలు కోల్పోయిన ఆదాయం చూస్తే.. రూ. 151 కోట్లుగా ఉంది. విమానయాన సంస్థలు సింహభాగం ప్రైవేటు సంస్థలు కావటంతో ఈ సంక్షోభాన్ని ఎలా తట్టుకుంటాయన్నదే ప్రశ్న.

Updated Date - 2020-04-15T09:31:06+05:30 IST