-
-
Home » Andhra Pradesh » Krishna » transport
-
కార్డ్.. కట కట!
ABN , First Publish Date - 2020-11-21T06:25:14+05:30 IST
డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి రాదు.. రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ కార్డు ఎక్కడ ఉందో తెలియదు..

రవాణా శాఖలో పీవీసీ కార్డుల కొరత
రెండు నెలలుగా వాహనదారుల ఇళ్లకు చేరని కార్డులు
చిప్ పీవీసీ కార్డుల సరఫరా నిలిచిపోవటంతో ముద్రణ బంద్!
జిల్లావ్యాప్తంగా 15 వేలకు పైగా నిలిచిన కార్డుల ప్రింటింగ్
పోలీసులు కేసులు రాస్తారేమోనని వాహనదారుల ఆందోళన
ఫామ్-22ను డౌన్‌లోడ్ చేసుకోమంటున్న రవాణా శాఖ
డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి రాదు.. రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ కార్డు ఎక్కడ ఉందో తెలియదు.. వాహనాన్ని ట్రాన్స్‌ఫర్ చేసినా.. లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నా.. టూ వీలర్ లైసెన్స్ నుంచి ఎల్‌ఎంవీ లైసెన్స్‌కు అప్‌గ్రేడ్ అయినా ఏదీ చేతికందదు. కారణం రవాణా శాఖ వద్ద వీటిని ముద్రించేందుకు చిప్ పీవీసీ కార్డులు లేవు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్డులు లేకుండా బయటకు వస్తే పోలీసులు కేసులు రాస్తారేమోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. రవాణా శాఖ అధికారులు మాత్రం ‘రవాణా శాఖ వెబ్‌సైట్ నుంచి ఫామ్ - 22ను డౌన్‌లోడ్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. దీనిని పొందటం తెలియని వారు.. ఇబ్బందులు పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
రవాణాశాఖలో లైసెన్సులు, రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్స్‌కు సంబంధించి చిప్ బేస్డ్ పీవీసీ కార్డుల వ్యవస్థను తీసుకు రావటం ఒక సంస్కరణ. అన్ని వేళలా అవసరమైన వీటిని తమతో ఉంచుకోవడానికి వాహనదారులకు కూడా సౌలభ్యంగా ఉంది. అయితే రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా చిప్ బేస్డ్ స్మార్ట్ కార్డులు వాహనదారులకు అందడం లేదు. స్టేషనరీ సమస్య కారణంగా రవాణాశాఖ దగ్గర చిప్ పీవీసీ కార్డులు అయిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 15 వేల కార్డుల ముద్రణ నిలిచిపోయింది. ఇవి లేకుండా బయటకెళితే పోలీసులు కేసులు నమోదు చేస్తారని వాహనదారులు ఆందోళన చెందుతుండగా, తయారు చేసి, డోర్ డెలివరీ ఇవ్వాల్సిన కార్డుల సంఖ్య పెరిగిపోతుండడం, వీటికి సంబంధించిన పని కొండలా పేరుకుపోతుండడం రవాణాశాఖ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.
రోజుకు 400 కార్డులకు డిమాండ్
జిల్లావ్యాప్తంగా రోజుకు 400 కార్డులకు పైగా ముద్రణకు డిమాండ్ ఉంది. విజయవాడతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీఓ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ర్టేషన్ల పని ఎక్కువే. వీటిలో కాలపరిమితి తీరిన లైసెన్స్‌ల రెన్యువల్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తుంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ మెర్జ్ దరఖాస్తులు వస్తుంటాయి. టూ వీలర్ లైసెన్స్ మాత్రమే కలిగిన వారు లైట్ మోటార్ వెహికల్ (ఎల్‌ఎంవీ), హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకునే వారు ఉంటారు. కండక్టర్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా ఉంటారు. లైసెన్స్, రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్‌ల డూప్లికేట్ కార్డులను పొందటానికి, చిరునామా మార్పు, రెన్యువల్స్, ఓనర్ ట్రాన్సఫర్స్‌కు దరఖాస్తులు వస్తుంటాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, కార్డులను ప్రింట్ చేసి, డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. రెండు నెలలుగా కార్డుల ప్రింటింగ్ నిలిచిపోవడం ఇప్పుడు అందరికీ ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
వాహనదారుల ఆందోళన
లైసెన్స్ , రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) లకు సంబంధించి ఇంటికి పీవీసీ కార్డులు రాకపోవటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇవి లేకుండా బయట వెళ్లి, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు రాస్తారని వాహనదారులు భయపడుతున్నారు. కరోనా కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వదిలేసి, సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్డు లేకుండా సొంత వాహనాలపై బయటకు వస్తే పోలీసులు ఎక్కడ కేసులు నమోదు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
ఫామ్ - 22 ను డౌన్‌లోడ్ చేసుకోండి : రవాణా శాఖ
వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యను రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళితే.. ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరి ధ్రువీకరణలకు సంబంధించిన ఫామ్ 22లను అందుబాటులో ఉంచామని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీనిని ప్రింట్ తీసుకుని, తమ దగ్గర ఉంచుకుంటే పోలీసుల తనిఖీల సమయంలో చూపించవచ్చునని చెబుతున్నారు. కానీ చాలా మంది వీటిని డౌన్‌లోడ్ చేసుకోవటం తెలియక నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంత చేసినా, పోలీసులు ఈ కాగితాలను పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.