నో స్టాక్.. ట్రాన్స్ఫార్మర్ల కొరత
ABN , First Publish Date - 2020-07-10T17:40:08+05:30 IST
శ్రావణ మాసం అరుదెంచనుంది. కొత్తగా నిర్మించుకున్న నివాసాల్లో గృహస్థులు పాదం మోపే సమయం ఆసన్నమయింది. అయితే వారిలో చాలా మందికి అనుకున్న సమయానికి కొత్త ఇంట్లోకి చేరే అవకాశం ఉంటుందో లేదోననే భయం వెంటాడుతోంది. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌసుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్నవారు గృహప్రవేశం చేద్దామంటే

విజయవాడ రూరల్ లో అధిక డిమాండ్
సుమారు 200 ట్రాన్స్ఫార్మర్ల కోసం నిరీక్షణ
మూడు నెలలుగా మూతపడిన తయారీ పరిశ్రమలు
ట్రాన్స్ఫార్మర్లపై కొవిడ్ ప్రభావం
(ఆంధ్రజ్యోతి - విజయవాడ): శ్రావణ మాసం అరుదెంచనుంది. కొత్తగా నిర్మించుకున్న నివాసాల్లో గృహస్థులు పాదం మోపే సమయం ఆసన్నమయింది. అయితే వారిలో చాలా మందికి అనుకున్న సమయానికి కొత్త ఇంట్లోకి చేరే అవకాశం ఉంటుందో లేదోననే భయం వెంటాడుతోంది. ప్రత్యేకించి అపార్ట్మెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌసుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్నవారు గృహప్రవేశం చేద్దామంటే విద్యుత్ వెలుగులు ప్రసరించే అవకాశం కనిపించడం లేదు. దీనికి కారణం విద్యుత్ శాఖను వేధిస్తున్న ట్రాన్స్ఫార్మర్ల కొరత. డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడంతో సీపీడీసీఎల్ అధికారులు చేతులెత్తేశారు. స్టాక్ వచ్చినప్పుడే ఏర్పాటు చేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. సాధారణ గృహనిర్మాణం చేపట్టేడప్పుడు ఎవరైనా కొత్తగా విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇది రోజుల వ్యవధిలో పూర్తయిపోతుంది.
అపార్టుమెంట్లు, విల్లాలు, గ్రూపు హౌస్‌ల నిర్మాణం విషయంలో అలా కుదరదు. అక్కడ నిర్మించబోయే ఫ్లాట్లు, విల్లాలకు విడివిడిగా విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ప్రత్యేకంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ను అమర్చుకోవాలి. అపార్టుమెంట్లు, విల్లాలకు పక్కనే వాటిని ఏర్పాటు చేస్తారు. వీటికోసం విద్యుత్ శాఖకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఐదు ఫ్లాట్లు ఉంటే 63కేవీ, పది ఫ్లాట్లు ఉంటే 10కేవీ, 20 ఫ్లాట్లు ఉంటే 160 కేవీ, 40 ఫ్లాట్ల అపార్టుమెంట్‌కు 360కేవీ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. ప్రధాన లైన్ల నుంచి ఈ ట్రాన్స్ఫార్లర్లకు అనుసంధానం చేసే విద్యుత్‌తీగలకు, వాటి కోసం ఏర్పాటు చేసే స్తంభాలకు యజమానులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు, వాటికి సంబంధించిన డబ్బులు చెల్లింపులు పూర్తయినా నిర్మించిన సిమెంట్ దిమ్మలపైకి ట్రాన్స్ఫార్మర్లు రావడం లేదు. రూ.5లక్షల వ్యయం అయ్యే ట్రాన్స్ఫార్మర్లకు డివిజనల్ ఇంజనీర్లు అనుమతిస్తారు. అదే రూ.15లక్షలయ్యే ట్రాన్స్ఫార్మర్లకు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, రూ.20లక్షల వ్యయమయ్యే వాటికి చీఫ్ ఇంజనీర్లు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 200 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పెండింగ్‌లో పడింది. అత్యధికంగా విజయవాడ రూరల్, గుణదల డివిజన్లలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. నిర్మాణాలు పూర్తయినా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఫ్లాట్ల యజమానులు గృహప్రవేశాలను వాయిదా వేసుకుంటున్నారు.
తయారీకి కొవిడ్ దెబ్బ
డిమాండ్‌ను బట్టి విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్చేజ్ అండ్ మెటీరియల్ సరఫరా విభాగం పనిచేస్తోంది. ఎక్కువగా హైదరాబాద్, కడప ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ మార్చి నుంచి తయారీ పూర్తిగా నిలిచిపోయింది. స్టాక్ ఉన్నా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు తెరుచుకోలేదు. ఈ ప్రభావం ట్రాన్స్ఫార్మర్లపై తీవ్రంగా పడిందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనితోపాటు అప్పటి వరకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)గా ఉన్న సంస్థ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్)గా విడిపోయింది. ఇందులో అన్నింటినీ విభజించుకోవాల్సి వచ్చిందని, ట్రాన్స్ఫార్మర్ల కొరతకు ఇదొక కారణమని మరికొంతమంది అధికారులు చెబుతున్నారు.
మూడు నెలలు మాత్రమే ఇబ్బంది
జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లకు మూడు నెలలపాటు ఇబ్బంది వచ్చింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల తయారీ పరిశ్రమలు మూతబడ్డాయి. ట్రాన్స్ఫార్మర్ల తయారీ లేకపోవడం వల్ల సరఫరా ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆర్డర్ల ప్రకారం వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను దరఖాస్తుల వారీగా పరిశీలించి ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల నుంచి వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే అపార్టుమెంట్లకు ఇస్తాం. మిగిలిన ట్రాన్స్ఫార్మర్లను జిల్లాలో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దానిస్థానంలో ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉంచుతున్నాం.
- ఎ.జయకుమార్, సీపీడీసీఎల్ ఎస్ఈ