ఇదిగో నిదర్శనం
ABN , First Publish Date - 2020-10-24T10:17:18+05:30 IST
దుర్గగుడిపై టికెట్ల దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చాంబర్ నుంచి కొండ దిగువన బ్రాహ్మణవీధిలోని..

మంత్రి క్యాంపు కార్యాలయానికి మారిన టికెట్ల దందా
ప్రొటోకాల్ వాహనాల్లో దర్జాగా వీఐపీ దర్శనాలు
అధిక ధరలకు విక్రయాలు
దుర్గగుడిలో మారని టికెట్ల దందా వ్యవహారం
విజయవాడ, ఆంధ్రజ్యోతి : దుర్గగుడిపై టికెట్ల దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చాంబర్ నుంచి కొండ దిగువన బ్రాహ్మణవీధిలోని దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయానికి దందాను మార్చారు. శుక్రవారం కనకదుర్గమ్మకు ప్రీతిపాత్రమైన రోజు కావడం, పైగా అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా వచ్చారు.
ఆన్లైన్లో పదివేల మందే టైమ్‌స్లాట్ ప్రకారం అమ్మవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక దేవస్థానం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా, స్టేట్ గెస్ట్‌హౌస్, పున్నమిఘాట్ వద్ద తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటుచేసిన కరెంట్ బుకింగ్ కౌంటర్లలో వచ్చిన వారందరికీ టికెట్లు విక్రయిస్తున్నారు. శుక్రవారం భక్తులు పోటెత్తడం, వీఐపీలు, స్వామీజీలు కూడా రావడంతో సామాన్య భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రాజకీయ పలుకుబడి ఉన్నవారంతా అమ్మవారి వీఐపీ దర్శనం కోసం దేవస్థానం పాలకమండలి సభ్యులను, అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు.
సీన్ అదే.. ప్లేస్ మారింది..
వారం రోజులుగా మహామండపం ఏడో అంతస్థుపై ఉన్న దుర్గగుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చాంబర్ కేంద్రంగా రూ.100 టికెట్లపై వీఐపీ దర్శనం చేయిస్తున్న వైనంపై ‘కొండపై టికెట్ దందా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. దీంతో రూ.100కే వీఐపీ దర్శనం చేయించే టికెట్ల విక్రయాలను బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలనా కార్యాలయంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయానికి మార్చారు. వీఐపీలకు దర్శనం చేయించేందుకు ఏర్పాటుచేసిన ప్రొటోకాల్ వాహనాలను జమ్మిదొడ్డిలోని మంత్రి కార్యాలయానికి రప్పించారు.
అక్కడ ‘వీఐపీ’ ముద్రతో ఉన్న రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను దుర్గగుడి అధికారిక వాహనాల్లోనే కొండపైకి తీసుకెళ్లి వీఐపీ ప్రొటోకాల్ లైనులో దర్శనం చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని అనేకమంది అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో జమ్మిదొడ్డి కార్యాలయం భక్తులతో రద్దీగా కనిపించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నాలుగు ప్రొటోకాల్ వాహనాలు కొండపైకి తిరుగుతూనే ఉన్నాయి. సందట్లో సడేమియాగా కొంతమంది అమ్మవారి దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించడంతోపాటు భక్తులను ప్రొటోకాల్ వాహనాల్లో తీసుకెళ్లి దర్శనాలు చేయించినందుకు ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.