వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకు జగన్‌కు కొత్త ప్రపోజల్..!

ABN , First Publish Date - 2020-10-31T19:29:35+05:30 IST

అభిప్రాయ భేదాలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కలిసి పనిచేయండి..’ అని ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావుల చేతులను కలిపారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. అయినా వంశీ, యార్లగడ్డల మధ్య రగులుతున్న ఆధిపత్య పోరు ఆగడం లేదు. అది నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది.

వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకు జగన్‌కు కొత్త ప్రపోజల్..!

ఆరని జ్వాల.. చేతులు కలిపినా చల్లారని మంటలు

వంశీనే టార్గెట్‌.. ప్రత్యర్థి త్రయం భేటీ

ప్రస్తుతానికి ‘స్థానిక’ విజయం పైనే దృష్టి

వంశీని విజయవాడ పంపాలని ప్రతిపాదన

యార్లగడ్డను గన్నవరంలో నిలపాలని నిర్ణయం

‘స్థానిక’ ఎన్నికల తరువాత సీఎం దృష్టికి! 


విజయవాడ / హనుమాన్‌జంక్షన్‌(ఆంధ్రజ్యోతి) : ‘అభిప్రాయ భేదాలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కలిసి పనిచేయండి..’ అని ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావుల చేతులను కలిపారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. అయినా వంశీ, యార్లగడ్డల మధ్య రగులుతున్న ఆధిపత్య పోరు ఆగడం లేదు. అది నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. 


గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా వైసీపీ పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే బాలవర్దనరావు, యార్లగడ్డ వెంకటరావు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. తాజాగా ఈ ముగ్గురూ మరోసారి రహస్యంగా భేటీ కావడం గమనార్హం. హనుమాన్‌జంక్షన్లోని దుట్టా రామచంద్రరావును ఆయన నివాసంలో బాలవర్దనరావు, యార్లగడ్డ వెంకటరావు శుక్రవారం కలిశారు. వీరు ముగ్గురూ గంటపాటు సమావేశమయ్యారు. కాకులపాడులో వైసీపీ కార్యకర్త ఇంట్లో వివాహానికి హాజరయ్యే సందర్భంలో తామంతా కలిశామని వారు చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా వంశీ లక్ష్యంగా చర్చలు సాగినట్టు తెలుస్తోంది. 


‘స్థానికం’ తర్వాత చూద్దాం..

వంశీ టీడీపీ గుర్తుపై విజయం సాధించినప్పటికీ, ఎన్నికైన కొద్దికాలం నుంచే వైసీపీకి అనుబంధ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా, తనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం పెంచుతున్నారని మిగిలిన శ్రేణులు రగిలిపోతున్నాయి. అదే సమయంలో దుట్టా, బాలవర్దనరావు, యార్లగడ్డలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థల్లో వైసీపీకి ఆది నుంచి కష్టపడిన పనిచేసిన వారిని గుర్తించి వారినే నిలపాలని ఈ ముగ్గురు నేతలూ నిర్ణయించారు.


వాళ్లనే ఎన్నికల్లో గెలిపించుకుని ఆ తర్వాత అసలు సంగతి చూద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ గన్నవరంలోనే ఉన్నా, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి విజయవాడ పంపించాలని చూస్తున్నారు. ఆ స్థానంలో కేడీసీసీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావును నిలపాలనే ప్రతిపాదన ఉంది. దీనికి ఇప్పటి నుంచే పునాది బలంగా వేసి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ ముందు ఆ ప్రతిపాదనను ఉంచాలని నిర్ణయించారు. అదే సమయంలో పార్టీలో సీనియర్‌ నాయకుడుగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఎమ్మెల్సీ ఇచ్చి, పెద్దల సభకు పంపేలా జగన్‌తో పచ్చజెండా ఊపించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఈ ప్రతిపాదనలు ఎంత వరకు ఫలిస్తాయో మరికొన్ని రోజులపాటు వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2020-10-31T19:29:35+05:30 IST