పోటీ నుంచి తప్పుకో.. లేదంటే.. ఖబడ్దార్‌..

ABN , First Publish Date - 2020-03-13T10:19:47+05:30 IST

అధికార పార్టీ బెదిరింపులు తారస్థాయికి చేరుతున్నాయి. అభ్యర్థులను బెదిరించడం.. ఉపాధి పనుల బకాయిల పేరుచెప్పి బుకాయించడం.. లేదంటే ప్రత్యక్ష గొడవలకు దిగడం.. కీలక నియోజకవర్గాల్లో పరిపాటిగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను టార్గెట్‌ చేసుకుని అధికార పార్టీ చేస్తున్న ఈ వికృత క్రీడ వివాదాలకు దారితీస్తోంది.

పోటీ నుంచి తప్పుకో.. లేదంటే..  ఖబడ్దార్‌..

బెదిరింపులకు దిగుతున్న వైసీపీ


అధికార పార్టీ బెదిరింపులు తారస్థాయికి చేరుతున్నాయి. అభ్యర్థులను బెదిరించడం.. ఉపాధి పనుల బకాయిల పేరుచెప్పి బుకాయించడం.. లేదంటే ప్రత్యక్ష గొడవలకు దిగడం.. కీలక నియోజకవర్గాల్లో పరిపాటిగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను టార్గెట్‌ చేసుకుని అధికార పార్టీ చేస్తున్న ఈ వికృత క్రీడ వివాదాలకు దారితీస్తోంది.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి


పోటీ నుంచి తప్పుకోండి గన్నవరంలో టీడీపీ నేతలకు బెదిరింపులు

‘నిన్నటి వరకు మనమంతా కలిసే పనిచేశాం. ఇప్పుడు మీకు మాకు ఎందుకు గొడవలు. పోటీ నుంచి తప్పుకోండి. మేం చెప్పినట్టు వింటే మీకు ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఇట్టే చేసిపెడతాం. కాదు కూడదంటారా.. కేసులు పెట్టి వేధిస్తాం. కోర్టులు చుట్టూ తిరగడానికే మీ ఆస్తులు, సమయం అన్నీ అయిపోతాయి.’గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేవారికి ఓ వైసీపీ నేత చేస్తున్న బెదిరింపుల సారాంశం ఇది. నిన్నటి వరకు ఆయన కూడా టీడీపీలో నాయకుడిగా చలామణి అయ్యారు. ఏఎంసీ చైర్మన్‌ గిరీ వెలగబెట్టారు. తమ నాయకుడు పార్టీ మారడంతో ఈయన కూడా ప్లేటు ఫిరాయించారు. నిన్నటి వరకు ఎవరైతే నాయకుల వెనుక తిరిగాడో ఇప్పుడు వారినే బెదిరించడం మొదలు పెట్టాడు. అధికార దర్పం.. ఏం చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమాతో నేరుగా తన మనుషులను పోటీలో ఉన్న ఎంపీటీసీల వద్దకు పంపించి తన అనుచరుల ఫోన్‌ నుంచే బెదిరిస్తున్నాడు. 


అక్కసుతోనే..

వాస్తవానికి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్దగా సానుకూలత లేదు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ ఎప్పుడైతే వైసీపీ శిబిరంవైపు మొగ్గారో అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీలో విభేదాలు మొదలయ్యాయి. తాజాగా యార్లగడ్డ నియోజకవర్గంలో తన కార్యాలయాన్ని కూడా మూసివేయడంతో ఆయన వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోయినా క్షేత్రస్థాయిలో బలంగా ఉంది.  ఈ పరిస్థితుల్లో  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం అనుమానమే. తాము గెలుపొందాలంటే తమకు పోటీ ఉండకూడదన్న ఉద్దేశంతో  అధికార పార్టీ నాయకులు కొందరు బెదిరింపులకు దిగారు. పోటీ నుంచి విరమించుకోవాలని రకరకాలుగా బెదిరిస్తున్నారు. 


పెడనలో పతాక స్థాయికి..

పెడన, మార్చి 12 : పెడన నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. పోటీలో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యాపారాలను దెబ్బతీస్తామని, కేసులు పెట్టి వేధిస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పెడన మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ నాయకుడిని వైసీపీ నేతలు బెదిరించడంతో వ్యాపారస్థుడైన ఆ నాయకుడు నామినేషన్‌ కూడా వేయకుండా పోటీ నుంచి విరమించుకున్నారు.


నామినేషన్‌ వేయొద్దంటూ సీపీఎం నాయకుడిని అధికార పార్టీ నాయకులు బెదిరించారు. పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం నాయకుడు వాసా గంగాధరరావు పట్టణంలోని ఆరో వార్డుకు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు అధికార పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. నామినేషన్‌ వేయవద్దని, వేస్తే ఇబ్బంది పడతావని గంగాధరరావును బెదిరించారు. అయితే, బెదిరింపులకు ఆయన లొంగలేదు. పార్టీ ఆదేశానుసారం నామినేషన్‌ వేసే తీరుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం నామినేషన్‌ వేయనున్నారు.


బకాయిలతో బుకాయింపులు

మచిలీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. పోటీ చేయకుండా ఉంటే ఆ బకాయిలను విడుదల  చేయిస్తామని మంత్రి అనుచరులు ఆ నాయకుడికి ఎర వేశారు. కానీ, బిల్లులు ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసంటూ ఆ నాయకుడు పోటీ చేసేందుకే సిద్ధమయ్యారు. గురువారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.  ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా పోటీ చేస్తున్న వారిలో పలువురు గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులు చేసి ఉన్నారు. వాటికి సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. వీటిని ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ పోటీ నుంచి విరమించుకునేలా టీడీపీ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. 

Updated Date - 2020-03-13T10:19:47+05:30 IST