ఈ పోరు ఆగదు

ABN , First Publish Date - 2020-10-12T14:08:24+05:30 IST

ప్రాణ సమానమైన భూములు త్యాగం చేసి అవమానాల పాలవుతున్నా..

ఈ పోరు ఆగదు

అమరావతి కోసం కదం తొక్కిన రైతులు, మహిళలు


సత్యనారాయణపురం(కృష్ణా): ప్రాణ సమానమైన భూములు త్యాగం చేసి అవమానాల పాలవుతున్నా వెనకడుగు వేయలేదు.. లాఠీలకు వెరవలేదు.. ఉక్కుపాదం మోపుతున్నా భయపడలేదు.. రాజధాని రైతులు, మహిళలు అలుపెరగక సాగిస్తున్న ఉద్యమం సోమవారం 300వ రోజుకు చేరుకుంటోంది. ఈ సందర్భంగా ఆదివారం తుళ్లూరు నుంచి మందడం వరకూ ‘మహాపాదయాత్ర’ సాగింది. 


అమరావతి ఉద్యమం సోమవారం 300వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఆదివారం ఆందోళనలు మిన్నంటాయి. తుళ్లూరు నుంచి మందడం వరకు 29 గ్రామాల రైతులు, మహిళలు మహాపాదయాత్ర నిర్వహించారు. నాన్‌ పొలిటికల్‌ జేఏసీ, పొలిటికల్‌ జేఏసీ నేతలు వేర్వేరుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున్న అమరావతి మద్దతుదారులు, ఉద్యమకారులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజధాని అమరావతి కోసం ఆదివారం విజయవాడ నగరంలోనూ, అమరావతి పరిరక్షణ సమితి, మహిళా జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ‘అమరావతి వాక్‌’ నిర్వహించారు. మూడు రాజధానుల మాటను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ పోరు సాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు, జేఏసీ సభ్యులు ప్రకటించారు. 


బీఆర్టీఎస్‌ రోడ్డులోని శారద కళాశాల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర గుణదల పడవల రేవు వరకు సాగింది. ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని..’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు అక్కినేని వనజ, సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అమరావతి శ్మశానం కాదని, ఏపీ అభివృద్ధికి పునాది అని, రాజధాని తరలింపు రాజకీయ కుట్ర అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాలు అమరావతి నుంచే పాలన సాగిందని గుర్తుచేశారు. రాజకీయ స్వార్థంతో రాజధానిని మూడు ముక్కలు చేయడం తగదని హితవు చెప్పారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎ.శివారెడ్డి, టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ, మహిళాసంఘం నాయకురాలు దుర్గాభవానీ, సీపీఎం నేత సీహెచ్‌ బాబూరావు, నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-12T14:08:24+05:30 IST