ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీలు

ABN , First Publish Date - 2020-11-21T06:18:09+05:30 IST

ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అత్తా కోడళ్లను సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీలు

విజయవాడ, నవంబర్‌ 20(ఆంధ్రజ్యోతి): ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అత్తా కోడళ్లను సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక మాచవరం డౌన్‌లో క్యాన్సర్‌ ఆస్పత్రి వెనుక ప్రాంతానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, సాత్విక అత్తా కోడళ్లు. లాక్‌డౌన్‌లో కుటుంబం గడవక నేరాల బాట పట్టారు. నిత్యం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి చోరీలు చేసేవారు. ఇలా భవానీపురం పీఎస్‌ పరిధిలోని లలితానగర్‌, పటమట పీఎస్‌ పరిధిలో నిడమానూరు రామాలయం వీధిలో, అజిత్‌సింగ్‌ నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో, మాచ వరంలోని మారుతీనగర్‌ ఎమ్మెస్సార్‌ వీధిలో చోరీలు చేశారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా అత్తాకోడళ్లు ఇద్దరూ అనుమానాస్పదంగా కనిపించారు. పాత నేరగాళ్ల వేలిముద్రలతో ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలను పోల్చిచూడగానే సరితూగడం లేదు. దీంతో ధనలక్ష్మి, సాత్వికను అదుపులోకి తీసుకుని వేలిముద్రలు పరిశీలించగా సరిపోవడంతో అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6లక్షల విలువ చేసే 235 గ్రాముల బంగారం వస్తువులు, ఒక కిలో వెండి వస్తువులను స్వాఽధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-11-21T06:18:09+05:30 IST