కాసులిస్తే అంతా ఓకే!

ABN , First Publish Date - 2020-06-22T09:53:51+05:30 IST

బీసెంట్‌ రోడ్డులో ఓ ఇంటి యజమాని తమ కింద భాగంలో ఉన్న షాపును మరొకరికి అద్దెకు ఇచ్చాడు. కొద్దినెలలుగా యజమానికి, వ్యాపారికి

కాసులిస్తే అంతా ఓకే!

ఆంధ్రజ్యోతి - విజయవాడ : బీసెంట్‌ రోడ్డులో ఓ ఇంటి యజమాని తమ కింద భాగంలో ఉన్న షాపును మరొకరికి అద్దెకు ఇచ్చాడు. కొద్దినెలలుగా యజమానికి, వ్యాపారికి మధ్య వివాదం నడుస్తోంది. ఇది సివిల్‌ వ్యవహారం అయినప్పటికీ ఓ ఎస్సై మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి యజమాని తరపున వకాల్తా తీసుకుని, వ్యాపారికి వార్నింగ్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అధికారుల ముందు సంస్కారవంతుల్లా, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తున్నట్టు వ్యవహరించే కొందరు పోలీసులు క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో విధులు నిర్వర్తించిన పోలీసులపై ప్రజలు ప్రశంసలజల్లు కురిపించారు. ఇప్పుడు ఆ ప్రజలే కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తున్నారు.


పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏ ప్రదేశం ఏ జోన్‌లో ఉందో తెలియని పరిస్థితి. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న కొద్దీ ఆ ప్రదేశాల జోన్లు మారిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఉండేది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న తరుణంలో ఉదయం 11 గంటల వరకే కుదించారు. ఈ సమయం దాటిన తరువాత కూడా ఎంతో కొంత మొత్తాన్ని ముట్టజెబితే దుకాణాలు తెరుచుకున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తామనే వారు కూడా కొందరున్నారు. మూడు నెలలపాటు వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు కాస్తోకూస్తో వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గల్లాపెట్టెలో వేసుకుంటే, దాన్నీ ఖాకీలు లాగేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-06-22T09:53:51+05:30 IST