వెండి సింహాల చోరీ ఇంటి దొంగల పనేనా?

ABN , First Publish Date - 2020-09-18T14:47:25+05:30 IST

ఇంద్రకీలాద్రిపై నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? దుర్గమ్మ ఆస్తులకు భద్రత కరువైందా?..

వెండి సింహాల చోరీ ఇంటి దొంగల పనేనా?

నిఘా నిద్ర!

ఇంద్రకీలాద్రిపై కొరవడిన భద్రత 

భక్తుల ముసుగులో కొండపైకి అసాంఘిక శక్తులు 

నిద్రావస్థలో ప్రత్యేక భద్రత సిబ్బంది 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇంద్రకీలాద్రిపై నిఘా వ్యవస్థ నిద్రపోతోందా? దుర్గమ్మ ఆస్తులకు భద్రత కరువైందా? అమ్మవారి వెండి రథంపై ఉండే నాలుగు సింహాల్లో మూడు మాయమైనాక అందరిలోనూ ఇవే సందేహాలు. రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీఎఫ్‌) సిబ్బంది, పోలీసు సిబ్బంది, హోంగార్డులు కొండపై నిరంతరం షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తుంటారు. వీరికి తోడు వందల మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. ఆలయ పరిసరాల్లో అడుగడుగునా అత్యాధునిక సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉంది. అయినా అమ్మవారి వెండి రథంపై నుంచి మూడు సింహాలు విగ్రహాల చోరీకి గురవడం నిఘా వ్యవస్థ పనితీరును వేలెత్తి చూపుతోంది. ఇంత భద్రత నడుమ రథంపై ఉండే విగ్రహాలను మాయం చేయడం ఇంటి దొంగలకు తప్ప ఇతరులకు సాధ్యం కాదన్న వ్యాఖ్యానాలూ వినవస్తున్నాయి. 


అమ్మవారి వెండి రథంపై సింహం విగ్రహాల చోరీ వెనుక ఇంటి దొంగల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని కాపాడేందుకే దేవస్థానం ఉన్నతాధికారులు ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుగా ఉంచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఉగాదికి శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగించిన అనంతరం వెండి రథాన్ని మహామండపం కింద షెడ్డులో భద్రపరిచారని చెబుతున్నారు. అప్పటికి రథంపై సింహం విగ్రహాలున్నాయి. ఆ తర్వాత రథాన్ని కొన్నాళ్లు జమ్మిదొడ్డిలోనూ, అక్కడి నుంచి మళ్లీ కొండపైకి తీసుకువెళ్లి మహామండపం ముందు ఉంచారు. ఈ ఏడాది ఉగాదికి కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో అమ్మవారిని వెండి రథంపై ఊరేగించలేదు.


లాక్‌డౌన్‌ కారణంగా మే వరకు దర్శనాలను పూర్తిగా నిలిపివేసి, అమ్మవారికి ఏకాంత సేవలను మాత్రమే నిర్వహించారు. ఆ సమయంలో భద్రత సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో విధులకు హాజరు కాలేదు. రాత్రివేళల్లో కొండపై నిర్మానుష్యంగా ఉండేది. అదే అదనుగా దుండగులు వెండి రథంపై సింహం విగ్రహాలను బలవంతంగా పెకలించి తీసుకుపోయి ఉంటారని దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి. ఇంటి దొంగల సహకారంతోనే విగ్రహాలను అపహరించి, పైన ప్లాస్టిక్‌ టార్పాలిన్‌ను యథాతథంగా ముసుగు వేయడంతో చోరీని ఎవరూ గుర్తించలేదు.. కొండపై అంతటా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ సమయంలో ఫుటేజీని పరిశీలించేవారు లేకపోవడంతో ఇది ఎవరి కంటా పడలేదంటున్నారు. ఇప్పుడు సీసీ ఫుటేజీ చూద్దామంటే దీని బ్యాకప్‌ 15 రోజులకు మించి ఉండదు. దీంతో ఆధారాలు కూడా లేకుండా పోయాయని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. 


ముడుపులిచ్చేవారికే ‘సెక్యూరిటీ’ 

దేవస్థానం భద్రతకు అధికారులు సుమారు 150 నుంచి 200 మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తారు. గతంలో ఈ కాంట్రాక్టును హైదరాబాదుకు చెందిన ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ దక్కించుకుంది. ప్రస్తుత ఈవో ఎం.వి.సురేశ్‌బాబు బాధ్యతలు చేపట్టే సమయానికి ఆ సంస్థ కాంట్రాక్టు గడువు పూర్తయింది. దీంతో స్థానికంగా ఉండే మ్యాక్స్‌ సెక్యూరిటీస్‌కు భద్రతను అప్పగించారు. ఇందుకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలున్నాయి. సెక్యూరిటీ సంస్థ గడువు ముగిసిన తర్వాత కూడా టెండర్లు పిలవకుండా కరోనా వంకతో పాత సంస్థనే కొనసాగిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో కొండపై సెక్యూరిటీ సిబ్బంది పట్టుమని పది మంది కూడా విధులు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇదే అదునుగా దుండగులు వెండి సింహాలను మాయం చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


నిద్రావస్థలో నిఘా పోలీసులు 

గతంలో అమ్మవారి కిరీటం చోరీ జరిగిన నుంచి నేటి వరకు కొండపై అనేక ఘటనలు జరిగాయి. గుడిలోని నిఘా వ్యవస్థ ఆధారంగా దొంగలను పట్టుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు. కొండపై నేరాలు జరిగినప్పుడల్లా తూతూ మంత్రంగా విచారణ చేసి.. మసిపూసి మారేడుకాయ చేయడమే తప్ప నేరస్థులను ఆధారాలతో పట్టుకుని, శిక్షించిన దాఖలాలు 

లేవు. 


దుర్గమ్మ ఆస్తులకు మేం కాపలాగా ఉంటాం 

- మంత్రి వెలంపల్లిని రాజీనామా చేయమనడానికి వీర్రాజు ఎవరు? 

- దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు 


విజయవాడ: కనకదుర్గమ్మ ఆస్తులకు తాము కాపలాగా ఉంటామని దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు అన్నారు. అమ్మవారి వెండి రథంపై ఉన్న మూడు సింహం విగ్రహాలు చోరీకి గురైన నేపథ్యంలో గురువారం ఆయన దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వెండి సింహాలు మాయమైన ఘటనతో ముడిపెట్టి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ, జనసేన నాయకులు కూడా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 


Updated Date - 2020-09-18T14:47:25+05:30 IST