దుర్గమ్మ సన్నిధిలో రెచ్చిపోతున్న దొంగలు.. సాక్ష్యమిదే!

ABN , First Publish Date - 2020-12-17T07:09:13+05:30 IST

దుర్గమ్మ సన్నిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్న వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడుతూ అమ్మవారి సొమ్మును దొరికినంత దోచుకుపోతున్నారు.

దుర్గమ్మ సన్నిధిలో రెచ్చిపోతున్న దొంగలు.. సాక్ష్యమిదే!

దొరికినంత దోచుకో..

హుండీల లెక్కింపునకు సేవకురాలిగా వచ్చిన మహిళ చేతివాటం 

రూ.60వేలు, బంగారు వస్తువుల చోరీకి యత్నం 

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భద్రత సిబ్బంది 

మంత్రి ఒత్తిడితో కేసు పెట్టకుండా తప్పించే యత్నం


విజయవాడ, ఆంధ్రజ్యోతి: దుర్గమ్మ సన్నిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలున్న వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడుతూ అమ్మవారి సొమ్మును దొరికినంత దోచుకుపోతున్నారు. కొంతమంది చోటామోటా నాయకులు అధికార పార్టీ నేతలతో ఒత్తిడి చేయించి కొండపై కాంట్రాక్టులను చేజిక్కించుకుంటుంటే, మరికొందరు అక్రమ మార్గాల్లో సొమ్మును కాజేస్తున్నారు. ఇంకొందరు చిల్లర దొంగలు నేరుగా హుండీల్లో సొత్తు దోచుకుంటున్నారు. తాజాగా హుండీల లెక్కింపులో దొంగతనమే ఇందుకు నిదర్శనం.


దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం జరిగిన అమ్మవారి హుండీల ఆదాయం లెక్కింపులో గుర్తింపు కార్డుతో సేవకురాలిగా పాల్గొన్న వన్‌టౌన్‌ ప్రాంత మహిళ చేతివాటాన్ని ప్రదర్శించింది. రూ.60వేలకు పైగా నగదు, అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన చిన్నచిన్న బంగారు వస్తువులను తస్కరించింది. వీటి విలువ దాదాపు రూ.లక్ష పైనే. ఈ మొత్తాన్నీ అధికారులు ఇచ్చిన గుర్తింపు కార్డులోనే పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించింది. చివరికి దేవస్థానం ప్రత్యేక భద్రతా సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. 


రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా..

హుండీల లెక్కింపులో దొంగ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా దుర్గగుడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, వ్యవహారాన్ని గోప్యంగా ఉంచారు. ఆ మహిళ రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు బాగా తెలిసిన మనిషి కావడం వల్లే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబుకు ఫోన్‌ చేసి పోలీసు కేసు పెట్టొద్దని, చోరీ ఘటనను గోప్యంగా ఉంచాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దుర్గమ్మ సన్నిధికి సేవకుల ముసుగులో అనేక మంది వస్తుంటారు. వారు ఎలాంటివారో తెలుసుకోకుండానే అధికారులు గుర్తింపు కార్డులు ఇచ్చేయ డంతో సేవకుల ముసుగులో వస్తున్న దొంగలు కొండపై రెచ్చిపోతున్నారు. దీంతో దుర్గగుడి అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-12-17T07:09:13+05:30 IST