-
-
Home » Andhra Pradesh » Krishna » theft
-
గురజాడలో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-11-25T06:26:23+05:30 IST
పమిడిముక్కల మండలం గురజాడలో భారీ చోరీ జరిగింది. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి.

కోటి రూపాయల బంగారు, వెండి వస్తువుల అపహరణ
విచారణ చేపట్టిన పోలీసులు
గురజాడ (పమిడిముక్కల) నవంబరు 24: పమిడిముక్కల మండలం గురజాడలో భారీ చోరీ జరిగింది. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. గురజాడకు చెందిన చల్లా రాజేశ్వరి తన సోదరి ఇంట్లో శుభకార్యం నిమిత్తం హైదరాబాదు వెళ్లి సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె గేటు తీసి ఇంటిలోకి వెళ్లే క్రమంలో తలుపు తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి వస్త్రాలు, ఇతర వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కనిపించలేదు. తమ బంధువులను పిలిచి ఘటన వివరాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగశ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఏసీపీ విజయపాల్, ఏడీఏ క్రైమ్ సుభాష్‌చంద్రబోస్, క్రైమ్ ఏసీపీ చలసాని శ్రీనివాస్, క్రైమ్ సీఐలు సాయిరమేష్, చలపతి, రామ్‌కుమార్, ఏడీసీపీ లాఅండ్ ఆర్డర్ లక్ష్మీపతి విచారణ చేపట్టారు.క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. మంగళవారం సీపీ బత్తెన శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 550 గ్రాముల బంగారు నాగశివలింగంతో పాటు బంగారు గొలుసులు, చెవి దుద్దులు, హారాలు కలిపి కిలో 200 గ్రాముల బంగారం, పళ్లెం, గ్లాసులు ఇతర వస్తువులు కలిపి 10 కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఉయ్యూరు సీఐ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని ఎస్సై సత్యనారాయణ తెలిపారు.