ఒకరి నిర్లక్ష్యం..12 మంది దుర్మరణం
ABN , First Publish Date - 2020-06-18T09:43:14+05:30 IST
లారీ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యం 12 మందిని బలిగొంది. వేదాద్రి సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి

జగ్గయ్యపేట రూరల్, జూన్ 17: లారీ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యం 12 మందిని బలిగొంది. వేదాద్రి సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి బొగ్గు లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన గూడూరు శివనాగిరెడ్డి కుటుంబీకులు, బంధువులు మొత్తం 26 మంది మొక్కుబడులు తీర్చుకునేందుకు మంగళవారం రాత్రి వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చారు. రాత్రి ఆలయంలోనే నిద్ర చేశారు. తెల్లవారుజామున కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అక్కడే వంట చేసుకుని భోజనాలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ట్రాక్టర్‌పై తిరిగి స్వగ్రామాలకు బయలుదేరారు. వేదాద్రి నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది.
వేదాద్రి పరిసరాలు కొండలు, గుట్టలతో నిండి ఉంటాయి. రోడ్లు ఘాట్ రోడ్లను తలపిస్తుంటాయి. డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో వాహనాలు నడపాల్సి ఉంటుంది. శివనాగిరెడ్డి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మెరక మీద నుంచి పల్లానికి దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. అదే సమయంలో ఎదురుగా బొగ్గు లోడుతో మెరక ఎక్కుతున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొంది. మెరక ఎక్కే సమయంలో నిదానంగా ఎక్కాల్సిన డ్రైవర్ అతివేగంగా ఎక్కే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ కూడా పల్లానికి దిగుతుండటంతో వేగంగా ఉంది. రెండూ వేగంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీ పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఐరన్ ట్రాలీ కిందపడి అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇద్దరు సురక్షితంగా బయటపడగా, 12 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జయంతిలో విషాదం
రోడ్డు ప్రమాద మృతుల్లో ముగ్గురు వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన వారు. శివనాగిరెడ్డి సోదరుడైన గూడూరు సూర్యనారాయణరెడ్డి మూడు దశాబ్దాల క్రితమే పెద్దగోపవరం నుంచి జయంతి వచ్చి స్థిరపడ్డారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి గ్రామంలో అందరికీ తలలో నాలుకగా ఉండేవారు. ప్రమాదంలో ఈయనతో పాటు భార్య, మనవడు మృతిచెందారు. దీంతో జయంతి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
నేతల పరామర్శ
ప్రమాదం గురించి తెలియగానే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రత్యేకంగా అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
నందిగామ డీఎస్పీ జీవీ రమణమూర్తి, సీఐ నాగేంద్రకుమార్, చిల్లకల్లు ఎస్‌ఐ అభిమన్యు, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణకుమార్, ఖమ్మం పురపాలక సంఘం చైర్మన్ లింగాల కమలరాజ్ బాధితులను పరామర్శించారు.