తాజాగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-17T08:56:12+05:30 IST

వారం క్రితం గొల్లపూడికి చెందిన ఒక వ్యక్తి కరోనా బారినపడి మరణించారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ

తాజాగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌

విజయవాడ, ఆంధ్రజ్యోతి : వారం క్రితం గొల్లపూడికి చెందిన ఒక వ్యక్తి కరోనా బారినపడి మరణించారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా, చనిపోయిన వ్యక్తి భార్య, కుమారుడికి ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే, గొల్లపూడి దర్గా హరిజనవాడలో ఇటీవల ఒక వృద్ధురాలు మరణించింది. ఆమె మనవడికి, అతని స్నేహితుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మనవడు పాతబస్తీలోని ఒక బీరువాల తయారీ కంపెనీలో పనిచేస్తాడని, అక్కడే అతనికి వైరస్‌ సోకి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. గొల్లపూడికే చెందిన ఆటోడ్రైవర్‌ భార్యకు కరోనా సోకింది. వీరితో కలిపి గొల్లపూడిలో ఇప్పటికి మొత్తం 12 మంది కరోనా బారిన పడ్డారు.


వారిలో ఇద్దరు మరణించగా, నలుగురు కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మిగిలిన వారంతా చికిత్స పొందు తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఒక రిటైర్డ్‌ టీచరుకు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం పిన్నమనేని సిద్ధార్థ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా, ఆయన తల్లికి, ఆమె చిన్నకుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఇద్దరితో కలిపి అజిత్‌సింగ్‌నగర్‌లో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరుకుంది. శనివారం నమోదైన ఏడు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ సంఖ్య 367కి చేరుకుంది. ఇంకా 2,932 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 


80 మంది డిశ్చార్జి

కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందు తున్న కరోనా బాధితుల్లో 80 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో అధికా రులు శనివారం డిశ్చార్జి చేశారు. దీంతో డిశ్చార్జి అయినవారి సంఖ్య 291కి చేరుకుంది. ప్రస్తుతం 62 మంది మాత్రమే కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 562 మంది క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారు.


ఇద్దరు మృతి

కొవిడ్‌ ఆసుపత్రిలో శనివారం మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా సోకడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న మరో బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం శుక్రవారం రాత్రి కొవిడ్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఆమె కూడా ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఇద్దరి మృత దేహాలకు ఆసుపత్రి సిబ్బందే  దహన సంస్కారాలు నిర్వహించారు.  ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.

Updated Date - 2020-05-17T08:56:12+05:30 IST