ఎన్నికల్లో జగన్‌ పార్టీని తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2020-03-13T10:15:02+05:30 IST

స్థానిక ఎన్నికల్లో జగన్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తిప్పికొట్టాలని పలువురు మహిళలు పేర్కొన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు గురువారం నాటికి 69వ రోజుకు చేరుకున్నాయి.

ఎన్నికల్లో జగన్‌ పార్టీని తిప్పికొట్టాలి

రాజధాని ప్రాంత మహిళలు

 తాడికొండ అడ్డరోడ్డు వద్ద 69వ రోజుకు చేరిన నిరసనలు 


తాడికొండ మార్చి 12: స్థానిక ఎన్నికల్లో జగన్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తిప్పికొట్టాలని పలువురు మహిళలు పేర్కొన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు గురువారం నాటికి 69వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మూడు రాజధానులు ప్రకటనతో ఇప్పటికే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు అగిపోయాయని తెలిపారు. అమరావతిలో నిర్మాణాలు అగిపోవటంతో లక్షల మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఉపాధి కోసం అమరావతికి వచ్చినవారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి వదిలి వెళ్లిపోయారన్నారు. పలు కంపెనీలు రాష్ట్రాన్ని విడిచిపెట్టి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. మూడు రాజధానుల వలన రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని, దీనివలన రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలు కూడా తరలి వెళ్లిపోయాయన్నారు.


అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ఇక్కడి ప్రజలు ఎవరూ అడ్డంకి చెప్పరని వారు స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలు రాష్ట్రానికి వస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, దానివలన అందరూ అభివృద్ధి చెందుతారని అభిప్రాయపడ్డారు. సాగునీరు, తాగునీరు అన్ని ప్రాంతాలకు అందిస్తే పంటలు పండి పుష్కలంగా సంపద పెరుగుతుందన్నారు. అది వదిలేసి పాలన వికేంద్రీకరణ చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. మూడు రాజధానులు ప్రకటనను ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.


Updated Date - 2020-03-13T10:15:02+05:30 IST