బయోమెట్రిక్‌ సేవలు తాత్కాలిక నిలుపుదల

ABN , First Publish Date - 2020-03-21T10:17:51+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బయెమెట్రిక్‌ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

బయోమెట్రిక్‌ సేవలు తాత్కాలిక నిలుపుదల

నేటి నుంచి ఎల్‌ఎల్‌ఆర్‌, పర్మినెంట్‌ లైసెన్సులు, త్రీటైర్‌

ఆఫ్‌లైన్‌ విధానంలో సేవలు నిలిపివేసిన రవాణా శాఖ


(ఆంధ్ర జ్యోతి, విజయవాడ):కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బయెమెట్రిక్‌ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా విజయవాడతో సహా అన్ని ఆర్టీఏ కార్యాలయాలు, టెస్టింగ్‌ సెంటర్లలో బయోమెట్రిక్‌ ఆధారిత సేవలు నిర్వహించబోరు. లెర్నర్‌ లైసెన్స్‌ పరీక్షలు(ఎల్‌ఎల్‌ఆర్‌), డ్రైవింగ్‌ లైసెన్స్‌ల సేవలు నిలుపుదల చేయనున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం జిల్లా ఉప రవాణా శాఖ అధికారి(డీటీసీ) ఎస్‌.వెంకటేశ్వరరావు పత్రికలకు విడుదల చేశారు. 


ఏప్రిల్‌ 5 వరకు నిలుపుదల

ఏప్రిల్‌ 5వ తేదీ వరకు బయోమెట్రిక్‌ సేవలు నిలుపుదల చేయనున్నారు. లెర్నర్‌ లైసెన్సులు, ఆరు నెలల ఎల్‌ఎల్‌ఆర్‌ పీరియడ్‌ ముగిశాక ఇచ్చే పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌కూ వాహనదారులు బయోమెట్రిక్‌ ఇవ్వాలి. దీంతో ఈ రెండు సేవలను అధికారులు నిలుపుదల చేశారు. కొత్త డ్రైవింగ్‌ లైసెన్సులనూ మంజూరు చేయరు. సేవలను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తామన్న దానిపై ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సమాచారమిస్తామని డీటీసీ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. 


30 వరకు త్రీటైర్‌ ఆఫ్‌లైన్‌ సేవలు నిలుపుదల

రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండడంతో త్రీటైర్‌ ఆఫ్‌లైన్‌ విధానంలో జరిగే వాహనాల లావాదేవీలనూ ఈ నెల 30వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నామని డీటీసీ ప్రకటించారు. రవాణాశాఖ కార్యాలయాల్లోకి ఎక్కువ మంది సందర్శకులు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు పనిచేసే స్థానంలో ఉపయోగించే వస్తువులన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడానికి శానిటైజేషన్‌ చేయించాలని అధికారులకు సూచించారు. రవాణాశాఖ సిబ్బందికి ఆరోగ్య సమస్యలు వస్తే ఆంక్షలు విధించకుండా తక్షణం సెలవులు ఇవ్వాలని ఆయన ఆర్టీవోలను ఆదేశించారు. 

Updated Date - 2020-03-21T10:17:51+05:30 IST