ఘనంగా శ్రీకృష్ణదేవరాయ జైత్రయాత్ర మహోత్సవం

ABN , First Publish Date - 2020-02-12T09:53:26+05:30 IST

సాహితీ సమరాంగుణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు అని చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ పేర్కొన్నారు.

ఘనంగా శ్రీకృష్ణదేవరాయ   జైత్రయాత్ర మహోత్సవం

శ్రీకాకుళం (ఘంటసాల), ఫిబ్రవరి 11 : సాహితీ సమరాంగుణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు అని చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.వి.డిఎన్‌.లీలాకుమార్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు జైత్రయాత్ర మహో త్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఏసీ లీలాకుమార్‌ మాట్లాడుతూ తెలుగుభాష ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన ఘనత కృష్ణదేవరాయలుదేనన్నారు. కళింగ దేశంపై దండెత్తి విజయగర్వంతో విజయనగర సామ్రాజ్యానికి తిరిగి వెళ్తున్న రాయల వారు 1518లో శ్రీకాకుళంలో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ను దర్శించుకున్నారన్నారు. ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో బసచేసిన రాయలవారికి ఆంధ్ర మహావిష్ణువు కలలో సాక్ష్యాత్కరించి తెలుగులో కావ్యం రాయమని ఆదేశించగా, స్వామి ఆదేశానుసారం శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద గ్రంథ రచనకు శ్రీకారం చుట్టారన్నారు. 


రాయలవారు తెలుగుభాష జైత్రయాత్రకు శ్రీకారం చుట్టి తన రాజ్యంలో భావ సమైక్యతకు కృషి చేశారన్నారు. ఈ మహాత్తరమైన సంఘటనను స్మరించుకుని తెలుగుభాష పరి రక్షణకు నడుంకట్టడానికి ఈ సంవత్సరం కృష్ణదేవరాయల మహోత్సవాలను తెలుగు జైతయాత్ర మహోత్సవాల పేరుతో నిర్వహిస్తున్నామన్నారు. తొలుత అముక్త మాల్యద మండపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. శ్రీకాకుళం పీఏసీఎస్‌ ఛైర్‌పర్సన్‌ కాట్రగడ్డ శ్రీనివాస చక్రవర్తి, మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు, వైసీపీ నాయకులు సింహాద్రి శ్రీనివాస్‌, తాడికొండ శ్రీనివాస్‌, డొక్కు అర్జునరావు, రాంబాబు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీకృష్ణదేవరాయ తెలుగు జైత్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీకాకుళేశ్వర మహిళా భక్తసమాజం వారిచే మురళీకోలాటం, మురళీకృష్ణ భక్తసమాజంవారిచే భక్తి పాటలు, రామభక్త సమాజం వారిచే భజన, మహిళలకు, పిల్లలకు మ్యూజికల్‌ ఛైర్స్‌, సంప్రదాయ ముగ్గుల పోటీలు, మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు బొమ్మతో చేసిన మిమిక్రీ అలరించింది. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.  

Updated Date - 2020-02-12T09:53:26+05:30 IST