నూజివీడులో పోలీసుల హడావిడి

ABN , First Publish Date - 2020-03-13T10:21:09+05:30 IST

నూజివీడు పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 32వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లి నాగరాజు వ్యాపార సంస్థపై పోలీసులు దాడిచేసి హడావిడి సృష్టించారు.

నూజివీడులో పోలీసుల హడావిడి

టీడీపీ అభ్యర్థి వ్యాపార సంస్థపై దాడులు

అభ్యర్థి ఎంపికైన గంటలోనే..

రికార్డులు చూపించమంటూ నానా హంగామా


నూజివీడు, మార్చి 12 : నూజివీడు పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 32వ వార్డు అభ్యర్థిగా పోటీచేస్తున్న పల్లి నాగరాజు వ్యాపార సంస్థపై పోలీసులు దాడిచేసి హడావిడి సృష్టించారు. ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిన గంటలోనే ఈ దాడులు జరిగాయి. వివరాల్లోకి వెళితే.. టీడీపీ 32వ వార్డు అభ్యర్థిగా స్థానిక హరిదుర్గ మణికంఠ ఫైనాన్స్‌ సంస్థ యజమాని పల్లి నాగరాజు (బీసీ)ను అధిష్ఠానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఎంపిక చేసింది. అనంతరం ఆయన పురపాలక సంఘం కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌కు అవసరమైన వివరాలు కనుక్కున్నారు. నాగరాజు సెకండ్‌ హ్యాండ్‌ బైకులను ఫైనాన్స్‌కు అమ్ముతుంటారు.  గురువారం సాయంత్రం 7.30 గంటల సమయంలో  నూజివీడులోని ఆ వ్యాపార సంస్థ దగ్గరకొచ్చి ‘ఇక్కడ ఉన్నవన్నీ దొంగబళ్లే.. లారీ తీసుకొచ్చి ఎక్కించండి..’ అంటూ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హంగామా సృష్టించారు. ప్రతి వాహనానికి రికార్డులు ఉన్నాయని నాగరాజు చెప్పారు. సవాలక్ష ప్రశ్నలతో ఆరా తీశారు.


దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరులతో వ్యాపార సంస్థ వద్దకు వచ్చి పోలీసులతో మాట్లాడారు. ‘ఇదేం విధానం. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి మీరు ఇలా వ్యవహరించడం భావ్యం కాదు.’ అని ఎస్‌ఐతో అన్నారు. తమకొచ్చిన ఫిర్యాదుల మేరకే దాడులు చేశామని ఎస్‌ఐ చెప్పారు. అభ్యర్థిగా ఎంపికైన గంటలోనే ఫిర్యాదులు అందాయా అంటూ ముద్దరబోయిన ప్రశ్నించడంతో మిగిలిన వాహనాల వివరాలను రేపు అందించాలని చెప్పి ఎస్‌ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


అరాచక పాలన : ముద్దరబోయిన

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు భయపడుతోందన్నారు. నేరగాళ్లు అధికారంలోకి వస్తే, పాలన ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ఈ వేధింపు చర్యలను స్థానిక ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ముద్దరబోయిన వెంట మాజీ కౌన్సిలర్లు వేమూరి వెంకట కృష్ణారావు, వాకా రాజ్‌కుమార్‌ అన్నే నాని, దాసరి స్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-13T10:21:09+05:30 IST