సమగ్ర భూసర్వే.. 332 గ్రామాల్లో తొలివిడత!

ABN , First Publish Date - 2020-12-10T06:23:19+05:30 IST

సమగ్ర భూ సర్వేను జిల్లాలో తొలివిడతగా 323 గ్రామాల్లో చేపడుతున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

సమగ్ర భూసర్వే.. 332 గ్రామాల్లో తొలివిడత!
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు

విజయవాడ సిటీ : సమగ్ర భూ సర్వేను జిల్లాలో తొలివిడతగా 323 గ్రామాల్లో చేపడుతున్నట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా యాజమాన్య హక్కు నిర్ధారణతో పాటు, రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియ చేపడతామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్షణ పథకం’ అమలుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 1005 రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడతగా 49 మండలాల్లోని 332 గ్రామాల్లో సర్వే నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు సర్వే నిర్వహించే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. 

అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్షణ’ పథకాన్ని ఈ నెల 21న సీఎం జగన్‌ జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్లు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ట మంగైన్‌, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, సర్వేశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.సూర్యారావు, మండల తహసీల్దార్లు, సర్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T06:23:19+05:30 IST