-
-
Home » Andhra Pradesh » Krishna » teachers
-
వెబ్ ఆప్షన్ ఇక్కట్లు!
ABN , First Publish Date - 2020-12-19T06:04:50+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల అంశం వారి సహనానికి పరీక్ష పెడుతోంది.

రోజుల తరబడి ఇంటర్‌నెట్‌ల వద్దే టీచర్లు
ఉపాధ్యాయుల సతమతం
గడువు పెంచే అవకాశం
పనిచేయని సర్వర్‌తో అనేకపాట్లు
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఉపాధ్యాయుల బదిలీల అంశం వారి సహనానికి పరీక్ష పెడుతోంది. తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు, పునర్విభజనలో పోస్టులు ఖాళీ ఏర్పడి బదిలీ అయ్యేవారు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంది. ఈనెల 11వ తేదీ నుంచి ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియకు అనుమతిచ్చారు. సర్వర్ 12వ తేదీ సాయం త్రం నుంచి పనిచేయడం ప్రారంభించిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సర్వర్‌లో వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయగానే వివరాలు నమోదుకాలేదని, 504 గేట్‌వే టైమ్‌అవుట్ అనే సంకేతం చూపుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 16వ తేదీతో ఆప్షన్లు ఎంచుకునేందుకు తుది గడువు అని చెప్పినా సర్వర్ సక్రమంగా పనిచేయని కారణంగా 18వ తేదీ వరకు ఈ గడువును పెంచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపాధ్యాయులు తెల్లవార్లు ఇంటర్‌నెట్ సెంటర్ల వద్దనే ఉండి ఆప్షన్లు ఎంచుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. గంటల తరబడి వేచి ఉండి వివరాలు నమోదు చేసినా సర్వర్ స్వీకరించకపోవడంతో కథ మళ్లీ మొదటికి వస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. మహిళా టీచర్లను ఈ ప్రక్రియ ఇబ్బందుల్లోకి నెట్టిందనే వాదన వినపడుతోంది.
వందలాది ఆప్షన్లు ఎంచుకోవాలి
ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ఇప్పటికే వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఆప్షన్లు కోరుకోవడం ఇబ్బందికరంగా మారింది. వెబ్‌లో చూపిన ఖాళీలు, సీనియారిటీ జాబితాలో తమకు ముందు, వెనుక ఉన్న ఉపాధ్యాయులు బదిలీ అయితే ఏర్పడే ఖాళీలను కూడా ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇబ్బందులు ఇవీ
వెబ్‌లో ఆప్షన్లు కోరుకునేందుకు ఆన్‌లైన్‌లోకి వెళితే సంబంధిత టీచరు ట్రెజరీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలను అడుగుతోంది. వెబ్ కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్రభుత్వం టీచర్ల సెల్‌ఫోన్లకు పంపిన పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. అనంతరం వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు ఓపెన్ అవుతుంది. అయితే ఈ వివరాలు నమోదు చేయగానే మీ ట్రెజరీ ఐడీ, పుట్టినతేదీ తప్పు అనే సమాచారం వస్తోంది. గంటపాటు ఈ ప్రక్రియను పదేపదే చేస్తే అప్పుడు సర్వర్ ఓపెన్ అవుతోంది. ఎడమవైపున జిల్లాకు సంబంధించిన 49 మండలాల పేర్లను చూపుతోంది. ఏ మండలానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ఇస్తున్నారో చూపుతూ 49 మండలాలను వరుసగా కుడివైపునకు మార్చుకోవాలి. డీఈవో కార్యాలయ అధికారులు మండలాల వారీగా చూపిన 1575 పాఠశాలల వివరాలు కనపడుతున్నాయి. ఈ 1575 ఆప్షన్లను ఎంచుకోవాల్సి వస్తోందని టీచర్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ నమోదు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసుకోమని వెసులుబాటు ఇస్తున్నారు. ఈ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత సబ్‌మిట్ అని కొడితే 60, 70 ఆప్షన్లు మాత్రమే కనపడుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్‌సైట్ పనిచేయలేదని, అదేమని వివరం కోరితే జిల్లాల వారీగా మార్పులు చేస్తున్నామనే సమాచారం ఇచ్చారని టీచర్లు చెబుతున్నారు. రెండు రోజులపాటు నెట్ సెంటర్ల వద్ద ఉంటేనే వెబ్ ఆప్షన్ ప్రక్రియ కొలిక్కి వస్తోందని వాపోతున్నారు. 12వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో పైన ఫలానా తేదీ తుది గడువు అని స్ర్కోలింగ్ వచ్చిందని, శుక్రవారం ఈ స్ర్కోలింగ్ నిలిపివేశారని ఉపాధ్యాయులు తెలిపారు. సర్వర్ సక్రమంగా పనిచేయని నేపథ్యంలో గడువు పెంచుతామని డీఈవోలతో శుక్రవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో విద్యాశాఖ కమిషనర్ తెలిపారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆప్షన్లు ఎంచుకునే విధానంలో ఇబ్బందులు ఎదురైతే ఈ సమస్యలు పరిష్కరించేలా ఎంఈవోలకు ఉత్తర్వులు ఇస్తామని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు వీసీలో తెలిపారని అంటున్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.