పోలవరంతో వైఎస్‌కు సంబంధం లేదు: యనమల
ABN , First Publish Date - 2020-12-03T17:38:17+05:30 IST
పోలవరం ప్రాజెక్టుతో వైఎస్‌కు ఎంత మాత్రం సంబంధం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

అమరావతి: పోలవరం ప్రాజెక్టుతో వైఎస్‌కు ఎంత మాత్రం సంబంధం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీల్లో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ...వైఎస్ పోలవరం కాల్వలు మాత్రమే తవ్వించారని... వైఎస్ విగ్రహం పెట్టాలని జగన్ భావిస్తే.. పోలవరం కాల్వల వద్ద పెట్టుకోవాలని సూచించారు. వైఎస్ విగ్రహం పెట్టాలని జగన్ అనుకుంటే ప్రజా ధనంతో కాకుండా తన సొంత డబ్బుతో పెట్టుకోవచ్చి హితవు పలికారు. కమిషన్ల కోసమే పోలవరం కాల్వలను వైఎస్ తవ్వించారని ఆరోపించారు. ఆ కాల్వలనూ పూర్తిగా తవ్వించలేకపోయారన్నారు. వైఎస్ హయాంలో పోలవరం కాల్వల తవ్వకాలు మొదలుపెట్టి వదిలేశారని... దాంతో ఆ ప్రాంతంలో మొక్కలు మొలిచాయని విమర్శించారు. తాము వచ్చాక కాల్వల కోసం భూసేకరణ పూర్తి చేశామని... అందుకే పట్టిసీమ ద్వారా నీటిని అందివ్వగలిగామని తెలిపారు. పోలవరంలో విగ్రహాలు పెట్టాల్సి వస్తే అంజయ్య, ఎన్టీఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు విగ్రహాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే భారీ విగ్రహాలు అవసరమా..? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.