ఢిల్లీలో రైతుల పోరాటంపై సోమిరెడ్డి స్పందన
ABN , First Publish Date - 2020-12-05T16:27:09+05:30 IST
ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు.

అమరావతి: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో 9 రోజులుగా రైతులు చలిలో వణుకుతూ ప్రాణాలను లెక్కచేయక పోరాడుతున్నారన్నారు. అధికారులు భోజన సౌకర్యం కల్పిస్తామన్నా నిరాకరించి పట్టుదలగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తెచ్చిందో కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పస్టం చేశారు. ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలన్నారు. కార్పొరేట్ కంపెనీలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలోనూ ఎంఎస్పీకి పైబడే అగ్రిమెంటు జరగాలని ఆయన అన్నారు.
పేద రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.ప్రైవేటు సంస్థలు ఎంత సరుకునైనా నిల్వచేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదముందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన విధానంతో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులతో వ్యవహరించి సత్వర నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు.