తండ్రి వయస్సున్న ప్రతిపక్షనేతను అలా అంటారా?: దివ్యవాణి

ABN , First Publish Date - 2020-12-02T18:56:19+05:30 IST

అసెంబ్లీలో చంద్రబాబు పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

తండ్రి వయస్సున్న ప్రతిపక్షనేతను అలా అంటారా?: దివ్యవాణి

అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబు పట్ల సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి వయసున్న ప్రతిపక్షనేతను పట్టుకొని పై కంపార్ట్‌మెంట్లో బుర్ర ఉందా అంటున్న ముఖ్యమంత్రికి మధ్య కంపార్ట్‌మెంట్లో మనస్సుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే, నోరున్నవాళ్లదే రాజ్యం, అధికారమున్నదే వాడిదే రౌడీయిజం అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీని దేవాలయమంటూనే, తండ్రి వయస్సున్న ప్రతిపక్షనేతను ముఖ్యమంత్రి అనరాని మాటలనడాన్ని ప్రజలంతా ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు.  పై కంపార్ట్ మెంట్‌లో బుర్ర అనేది ఉందా అని ప్రతిపక్షనేతను ప్రశ్నించిన ముఖ్యమంత్రికి మధ్య కంపార్ట్ మెంట్లో మనస్సాక్షి అనేది ఉందా? అని దివ్యవాణి ప్రశ్నించారు. 




25మంది ఎంపీలను ఇస్తే, ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీస్తానని చెప్పిన వ్యక్తికి ఏ కంపార్ట్ మెంట్లో ధైర్యం లోపించిందని యెద్దేవా చేశారు. మధ్య కంపార్ట్‌‌మెంట్లోని మనస్సాక్షి అందుకు ఒప్పుకోవడంలేదా అని నిలదీశారు. ప్రతిపక్షం రైతుల పక్షాన ప్రశ్నించబట్టే, ప్రభుత్వం రాత్రికి రాత్రి రైతులకు సొమ్ము విడుదలచేస్తూ జీవో జారీ చేసిందని... దాన్ని బట్టే చంద్రబాబు నాయుడి నిలదీతకు ప్రభుత్వం భయపడిందని అర్థమవుతోందన్నారు. జగన్ ప్రభుత్వం అర్థరాత్రి ప్రభుత్వమని ప్రజలకు అర్థమైందని తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంగానీ, టీడీపీ నేతల ఇళ్లు, సంస్థలు కూల్చడంలో గానీ, ప్రజావేదిక కూల్చివేతలో గానీ ముఖ్యమంత్రి అర్థరాత్రే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. కొడాలినానీ అరేయ్ అంటే, ఆయన్ని ఒరేయ్ తిరిగి అనడం నిమిషం పని అని మండిపడ్డారు.   వెన్నుపోటు అంటూ చంద్రబాబు నాయుడిని అనే ముందు, నానీ ఒక్కసారి ఇంగితజ్ఞానంతో ఆలోచిస్తే మంచిదని దివ్యవాణి హితవు పలికారు.

Updated Date - 2020-12-02T18:56:19+05:30 IST