తాడిపత్రి ఘటనలో పోలీసులే కీలకం: దీపక్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-26T18:47:32+05:30 IST

తాడిపత్రి ఘటనలో పోలీసులే కీలకంగా వ్యవహరించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి తెలిపారు.

తాడిపత్రి ఘటనలో పోలీసులే కీలకం: దీపక్‌రెడ్డి

అమరావతి: తాడిపత్రి ఘటనలో పోలీసులే కీలకంగా వ్యవహరించారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే , అతని కొడుకు, వారి అనుచరులు కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. గుంపులుగా వచ్చిన వైసీపీమూకలు.. జే.సీ.ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన రాళ్లురువ్వుతుంటే... 144 సెక్షన్ అమల్లో ఉందని  చెప్పిన పోలీసులు... దాడిని నిలువరించి, అక్కడకి వచ్చిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తన భార్య ఇసుకపై మామూళ్లు వసూలు చేస్తోందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చి, నిజానిజాలు తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యే , విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడితే పోలీసులు ఆయన్ని, అతని అనుచరులను వదిలేసి, టీడీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టడమేంటి అని మండిపడ్డారు.


వీడియోల్లో ఎమ్మెల్యే, అతని అనుచరుల వీరంగం స్పష్టంగా కనిపిస్తున్నా, పోలీసులు వారికి సహకరించారని అర్థమవుతున్నా, హోంమంత్రి సిగ్గు లేకండా శాంతిచర్చలకు వెళ్లారని చెప్పడమేంటి అని ఆయన నిలదీశారు. ఆయుధాలతో ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళ్లడం శాంతి చర్చలు ఎలా అవుతాయో హోంమంత్రి, జిల్లాఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి ఘటనను, అక్కడి పోలీసుల తీరుని సమర్థించినందుకు హోంమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలన్నారు. తాడిపత్రి ఘటన పోలీసుల ప్రమేయంతో జరిగిందని ఆధారాలు స్పష్టం చేస్తున్నందున, దాడిని ప్రోత్సహించి, వైసీపీ వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-26T18:47:32+05:30 IST