ఇసుక ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బుచ్చయ్య

ABN , First Publish Date - 2020-11-13T18:16:57+05:30 IST

రాష్ట్రంలో ఇసుక మాఫియా వేలకోట్లు దోచేస్తూ, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

ఇసుక ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బుచ్చయ్య

రు.



అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా వేలకోట్లు దోచేస్తూ, రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... 17నెలలుగా ఇసుక మీద కమిటీలపై కమిటీలు వేసిన జగన్ అండ్ కో చివరకు వేలకోట్లు వెనకేసుకుందని ఆరోపించారు. వరదలు తగ్గి, ఇసుక అందుబాటులో ఉన్నాకూడా సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి రావడం లేదన్నారు. కొత్తవిధానం పేరుతో తన వాళ్లకు ఇసుక కాంట్రాక్ట్‌ను కట్టబెట్టి, సరికొత్త దోపిడీకి పాలకులు తెరలేపారని ఆయన ఆగ్రహంవ్యక్తం చేశారు. ఒకే సంస్థకు రాష్ట్రంలోని ఇసుకరీచ్‌లన్నీ అప్పగిస్తే, పరిస్థితి చాలా దారుణంగా మారుతుందన్నారు. 


రేవుల్లో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చే బోట్ మెన్ సొసైటీల  ఛార్జీలను, జగన్ ప్రభుత్వం టన్నుకు రూ.180 నుంచి రూ.525కు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడిగామని... పారదర్శకంగా చేస్తున్నామని చెబుతూనే, దోపిడీకి సిద్ధమయ్యారని మండిపడ్డారు. 17నెలల్లో ఇసుక సీనరేజీపై గానీ, మైనింగ్ ద్వారా గానీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమెంతో తెలియచేస్తూ, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆఖరికి ఇసుక సమస్య వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలిచిపోయిందన్నారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను, వై.వీ.సుబ్బారెడ్డి కోస్తా జిల్లాలను, సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ జిల్లాలను దోచుకుంటుంటే ఈప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేసిన వారికే లక్షలాది రూపాయల పాత బిల్లులను ప్రభుత్వం నిలిపివేసిందని వ్యాఖ్యానించారు. లక్షా 50వేలకోట్ల అప్పులు చేసి, దోచుకున్నది చాలక, ఇసుక సహా, కాలేజీలు, హస్పిటల్స్‌నని కూడా వదలకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక ధర ఇన్ని రెట్లు పెంచిన జగన్ ప్రభుత్వం, దానిపై వచ్చిన ఆదాయం ఎక్కడికెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అరికట్టకుండా, లక్షలకోట్లు దోచుకునేలా ప్రభుత్వం రూపొందించిన కొత్త పాలసీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇసుక పాలసీ పేరుతో, తన మనుషులను రంగంలోకి దింపి, క్విడ్ ప్రోకో కన్నా దారుణంగా దోచుకోవడానికి కుట్రలు పన్నారని బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2020-11-13T18:16:57+05:30 IST