జగన్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతే: అయ్యన్న
ABN , First Publish Date - 2020-10-14T19:01:14+05:30 IST
జగన్ పాలనలో ఎక్కడా చూసినా అవినీతే రాజ్యమేలుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అమరావతి: జగన్ పాలనలో ఎక్కడా చూసినా అవినీతే రాజ్యమేలుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు మొదలు కార్యకర్తల వరకూ అందరూ భూ అవినీతిలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో రూ.4వేలకోట్ల వరకు దోపిడీ చేశారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న అవినీతిలో ముఖ్యమంత్రికి కూడా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. తన మంత్రివర్గంలోని వారు చేస్తున్న తప్పులను ఆయన సమర్థించడం చూస్తుంటే, ప్రజలకు ఇదే అనుమానం కలుగుతోందన్నారు. మంత్రి జయరామ్ అవినీతి వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా, ఆయనపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తన మంత్రివర్గంలోని సభ్యడు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంటే ఎలా అని నిలదీశారు. అవినీతి మంత్రిని జగన్ ఎందుకు కాపాడుతున్నాడని అడిగారు. మంత్రిపై చర్యలు తీసుకుంటే ఆయన తన అవినీతిని బయటపెడతాడన్న భయం జగన్‌లో ఉందా అని వ్యాఖ్యానించారు. గతంలో అంతా విచారించే భూములు కొన్నానని మంత్రి చెబితే.. ఆయన భార్యేమో ఇప్పుడు తమను మోసగించి భూములు కట్టబెట్టారని ఫిర్యాదు చేసిందని అన్నారు. విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిని పెంచి దాని పరిధిలో ఇళ్ల పట్టాలకు ఇచ్చే భూమి చదును పేరుతో మంత్రులు బొత్స, అవంతి, ఎంపీ విజయసాయి రూ.23కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. భూమి చదును పేరుతో ఎటువంటి టెండర్లు పిలవకుండానే పనులు చేయకుండా రూ.23కోట్లు కాజేశారని వ్యాఖ్యానించారు. ఆ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విశాఖ కేంద్రంగా ఎంపీ విజయసాయి సాగిస్తున్న భూదోపిడీ, సింహాచలం భూములు, మాన్సాస్ ట్రస్ట్ భూములు కాజేయడానికి చేస్తున్న ప్రయత్నాలు జగన్‌కు తెలియవా అని ప్రశ్నించారు. విశాఖలో ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన కోట్ల విలువైన ఆస్తులను కాజేయడానికి సదరు సంస్థను రాత్రికి రాత్రే ఎండోమెంట్ శాఖపరిధిలోకి తెచ్చారని మండిపడ్డారు. మంత్రి జయరామ్ అవినీతిపై జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకుంటే, తామే కోర్టుని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అంత వరకు రాకముందే ముఖ్యమంత్రి బెంజి మినిస్టర్ బాగోతంపై స్పందిస్తే మంచిదని హితవుపలికారు. మంత్రి కన్నబాబుకు మాటలు ఎక్కువ - పనితక్కువ అని దుయ్యబట్టారు. రైతు ప్రభుత్వమని గొప్పులు చెప్పుకుంటున్న వారు ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు బకాయిలను అన్నదాతలకు ఎందుకు చెల్లించలేదని అయ్యన్నపాత్రుడు నిలదీశారు.