-
-
Home » Andhra Pradesh » Krishna » TDP Dharna About Retaining wall
-
ఒక్క ఇంటినీ కూల్చకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలి
ABN , First Publish Date - 2020-11-25T06:40:58+05:30 IST
తారకరామానగర్, రణదీవెనగర్ కరకట్టలో ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు.
కృష్ణలంక, నవంబర్ 24 : తారకరామానగర్, రణదీవెనగర్ కరకట్టలో ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన టీడీపీ సీనియర్ నేత నాగుల్‌మీరా, నేతలు, కార్యకర్తలతో కలిసి కృష్ణానది ఇసుక తిన్నెలలో గోతులు తీసి అందులో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె, నాగుల్‌మీరా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణంలో భాగంగా రూ.550 కోట్లతో రెండు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా కరకట్ట కింద ఇల్లు తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం నేడు మార్కింగ్ వేసి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. కరకట్ట కింద ఉన్న ఇళ్లకు, రక్షణ గోడకు మధ్య 70 అడుగుల మేర స్థలం వదలి ఒక్క ఇంటినీ తొలగించకుండా రిటైనింగ్ వాల్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నరలో ఎనిమిది సార్లు వరదలు వచ్చినా ఒక్కసారి కూడా బాధితులకు వైకాపా ప్రభుత్వం పరిహారం చెల్లించలేదన్నారు. టీడీపీ హయాంలో ఒక్కసారి వరద వస్తేనే బాధితులకు ఒక్కొక్కరికి రూ.3,500 పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే పోరాటాన్ని ఉధృతం చేస్తామని గద్దె, నాగుల్‌మీరా హెచ్చరించారు. పేదల ఇళ్లు తొలగించి రక్షణగోడ కడితే ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే తప్పుకోవాలని, మేము కట్టి చూపిస్తామని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో 16, 17, 18, 22 డివిజన్ల టీడీపీ నేతలు వేముల దుర్గారావు, ముని పోలిపల్లి, ఇస్త్రం దానియేలు, ఎం.పీరుబాబు, మోటేపల్లి చిన్నా, రత్నం రమేష్, తలపాటి ప్రసాద్, ఆదిబాబు, కొమిరి శ్రీను, చింతా గోపి పాల్గొన్నారు.