సమ్మర్‌ ఫ్లైట్స్‌!

ABN , First Publish Date - 2020-03-04T08:39:37+05:30 IST

రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానం కలిగిన తిరుపతికి డైలీ ఫ్లైట్‌ సదుపాయం ఈ నెల 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

సమ్మర్‌ ఫ్లైట్స్‌!

తిరుపతికి డైలీ సర్వీసు

ముందుకొచ్చిన ఇండిగో

తిరుతిపతికి ఇది రెండో ఫ్లైట్‌ 

మధ్యాహ్న సమయంలో నడపటానికి డీజీసీఏ నుంచి అనుమతులు 

వారంలో రెండు రోజులు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ 

బెంగళూరుకు మరో విమాన సర్వీసు

ముందుకొచ్చిన స్పైస్‌జెట్‌! 

మార్చి 29 నుంచి అందుబాటులోకి రెండు సర్వీసులు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానం కలిగిన తిరుపతికి డైలీ ఫ్లైట్‌ సదుపాయం ఈ నెల 29వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో డైలీ సర్వీసును నడపటానికి ముందుకు వచ్చింది. విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసును నడపటానికి ఈ సంస్థ అంగీకారం తెలిపింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి విమాన సర్వీసు నడపటానికి అన్ని అనుమతులు వచ్చాయి. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, ప్రకాశం, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు విజయవాడ విమానాశ్రయం అతి దగ్గరగా ఉంది. ఈ జిల్లాల నుంచి ప్రతి రోజూ వేలాది సంఖ్యలో రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి వెళుతుంటారు. తిరుపతికి విజయవాడ నుంచి ఇది రెండో సర్వీసు. తిరుపతికి విజయవాడ నుంచి మొదట ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టింది.


ఈ సంస్థ వారంలో  రెండు రోజుల పాటు ఉదయం సమయంలో విమాన సర్వీసు నడుపుతోంది. ఈ విమాన సర్వీసు చాలా పెద్దది. ఎయిర్‌బస్‌ కావటంతో 180 సీటింగ్‌ ఉంటుంది. ఈ సర్వీసు విజయవంతంగా నడుస్తోంది. ఎంతో ఆదరణ కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండిగో సంస్థ ఈ వేసవి సమ్మర్‌ షెడ్యూల్‌గా తిరుపతిని ఎంచుకుంది. వేసవిలో తిరుపతికి వెళ్లే యాత్రికులు ఈ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబోయే సీజన్‌ను ఎన్‌ క్యాష్‌ చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో డైలీ ఫ్లైట్‌ షెడ్యూల్‌ను ప్రకటిచింది. మార్చి 29 నుంచి ఈ షెడ్యూల్‌ అమల్లోకి రానుంది. ప్రతి రోజూ తిరుపతి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఈ విమానం బయలుదేరి విజయవాడకు ఒంటి గంటకు వస్తుంది. తిరిగి విజయవాడలో 1.30 గంటలకు బయలుదేరి 2.30 గంటలకల్లా తిరుపతికి చేరుకుంటుంది. ఉదయం సమయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సదుపాయం వారంలో రెండు రోజులు ఉండటం, మధ్యాహ్న సమయంలో ప్రతి రోజూ ఇండిగో విమాన సర్వీసు ఉండటం ద్వారా తిరుపతి వెళ్లే యాత్రికులకు మరిన్న విమాన సర్వీసులు అందుబాటులోకి రానుతున్నాయి. 


బెంగళూరుకు స్పైస్‌జెట్‌ విమాన సర్వీసు  

 దక్షిణాదిలో బెంగళూరుకు మరో డైలీ ఫ్లైట్‌ నడవబోతోంది. సమ్మర్‌ షెడ్యూల్‌గా ఈ సర్వీసు అదనంగా నడపటానికి స్పైస్‌జెట్‌ నిర్ణయించింది. ఈ సర్వీసును కూడా మార్చి 29 నుంచి ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బెంగళూరు రూట్‌లో ప్రస్తుతం ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. నెలాఖరుకు ప్రారంభించే సర్వీసుతో బెంగళూరుకు నడిచే విమాన సర్వీసుల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా  విమానాలు నడిచే ప్రాంతాలలో మొదటి వరసలో హైదరాబాద్‌ ఉండేది. హైదరబాద్‌కు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రస్తుతం ఎలాంటి విమానాలు లేవు. హైదరాబాద్‌కు  విమానాలు తగ్గుతుంటే, బెంగళూరుకు విమానాల సంఖ్య పెరుగుతోంది. 

Updated Date - 2020-03-04T08:39:37+05:30 IST