మాలధారణం

ABN , First Publish Date - 2020-11-26T06:07:42+05:30 IST

మాలధారణం

మాలధారణం
భవానీలకు మాల వేస్తున్న గురు భవానీ

భవానీ దీక్షల స్వీకరణ ప్రారంభం 

ఈనెల 30 వరకు మండల దీక్ష స్వీకరణ 

వచ్చేనెల 15 నుంచి 19 వరకు అర్థమండల దీక్షలు

జనవరి 5 నుంచి 9 వరకు విరమణ ఉత్సవాలు 

ఆన్‌లైన్‌ టికెట్లు పొందినవారికే దుర్గమ్మ దర్శనం : ఈవో 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇంద్రకీలాద్రిపై భవానీ మాలధారణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం ఉదయం 8 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి మహామండపంలోని ఆరో అంతస్థులో ఏర్పాటుచేసిన భవానీ దీక్షా మండపంపై ప్రతిష్ఠించారు. ప్రధానార్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీనివాసశాస్త్రి, కోట ప్రసాద్‌, షణ్ముఖశాస్త్రి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన చేసి అమ్మవారిని ఆవాహన చేశారు. ఉత్సవమూర్తికి పగడాల మాలలు అలంకరించారు. అనంతరం ఆలయ ఉప ప్రధానార్చకుడు వై.నాగరాజుశాస్త్రి, ఉమాకాంత్‌శర్మ గురుభవానీలుగా దీక్ష చేపట్టి భక్తులకు మాలలు వేశారు. పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు దంపతులు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్షల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 30వ తేదీ కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు మండల దీక్ష మాలధారణ కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల 15 నుంచి 19వ తేదీ వరకు అర్థమండల దీక్షల మాలధారణ ఉంటుంది. డిసెంబరు 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశజ్యోతి ఉత్సవం ప్రారంభమై భారీ ఊరేగింపుగా దుర్గగుడికి చేరుకుంటుంది. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజులపాటు దీక్షల విరమణ ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు. కరోనా కారణంగా భవానీ భక్తులు ముందే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని, టైంస్లాట్‌ ప్రకారం దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆన్‌లైన్‌ టికెట్లను కనకదుర్గమ్మ దేవస్థానం వెబ్‌సైట్‌ ద్వారా, మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. 





Updated Date - 2020-11-26T06:07:42+05:30 IST