ఇంకా మిస్టరీగానే శ్రీహరిరావు హత్య కేసు.. నిందితుడిని ఎలాగైనా పట్టుకోవాలని..

ABN , First Publish Date - 2020-12-11T05:52:40+05:30 IST

దివి ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన డాక్టర్‌ శ్రీహరిరావు..

ఇంకా మిస్టరీగానే శ్రీహరిరావు హత్య కేసు.. నిందితుడిని ఎలాగైనా పట్టుకోవాలని..
రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీహరి రావు (ఫైల్‌)

డాక్టర్‌ శ్రీహరిరావు హత్య కేసులో ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు 


అవనిగడ్డ(కృష్ణా): దివి ప్రాంతంలో సంచలనం రేకెత్తించిన డాక్టర్‌ శ్రీహరిరావు హత్య కేసు మిస్టరీ ఇంకా వీడకపోవటంతో అసలు ఆ రోజు ఏం జరిగిందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతనెల 27వ తేదీ రాత్రి డాక్టర్‌ శ్రీహరిరావు హత్యకు గురయ్యారు. హంతకుడు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాకుండా ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను వెనక్కు తిప్పి వేయటంతో పాటు ఫుటేజ్‌ని భద్రపరిచే డీవీఆర్‌ను కూడా ఎత్తుకుపోయాడు. దీనికితోడు వేలిముద్రలు సేకరించే క్రమంలోనూ ఆసుపత్రి ఆవరణలోనూ, చుట్టుపక్కల ఎక్కువ మంది వేలిముద్రలు లభ్యం కావటంతో ఆ వేలిముద్రలు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లవా లేక హంతక ముఠా వారికి చెందినవా అన్న విషయం తేల్చేందుకు పోలీసులు దాదాపు 300 మంది దగ్గర నుంచి వేలిముద్రలను సేకరించారు. బయట పడిన పాత ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాక్టర్‌ శ్రీహరి రావు ఇంటి వద్ద మొదటి నుంచి సీసీ కెమెరాల నిఘా కొనసాగుతూనే ఉంది.


మార్చిలో పాత సిస్టంను తొలగించి కొత్తదాన్ని ఇన్‌స్టాల్‌ చేశారు. పాత సిస్టంలో ఫిబ్రవరి 24వ తేదీన సరిగ్గా 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో సంచరించినట్లుగా, అదే వ్యక్తి ఆరోజు కూడా కెమెరాలను పైకి తిప్పేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఆరోజు కూడా శ్రీహరిరావు ఇంటి వద్ద కుటుంబ సభ్యులెవరూ లేరు. అయితే ఆ అగంతకుడు లోపలకు వెళ్లే ప్రయత్నం కొన్ని కారణాల వల్ల విఫలం కావటంతో వెనుతిరిగాడు. ఆ అగంతకుడు దొంగతనానికి వచ్చి ఉంటాడని, ఎలాంటి వస్తువులూ పోకపోవటంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారని తెలిసింది. ఈనెల 27వ తేదీన ఫిబ్రవరిలో మాదిరి వైద్యుడు ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలుసుకొని ఆ అగంతకుడే ఇంటిలోకి చొరబడి శ్రీహరిరావును దారుణంగా హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.


ఫిబ్రవరి 24వ తేదీన ఏ విధంగానైతే అగంతకుడు సీసీ కెమెరాలను వెనక్కు తిప్పాడో అదే విధంగా హత్య జరిగిన రోజు కూడా కెమెరాలన్నింటినీ వెనక్కి తిప్పాడని హంతకుడు ఇంటిలోకి జొరబడిన సమయం కూడా సరిగ్గా గతంలో చొరబడిన సమయంతో సరిపోలటంతో అతనే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నవంబరు 27వ తేదీ రాత్రి 10.50 సమయంలో సీసీ కెమెరాలు ఆగిపోయినట్లుగా కుటుంబ సభ్యులు ఫోన్‌లో గుర్తించారని అయితే సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని భావించి ఇంటికి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య హంతకుడు ఇంట్లోకి చొరబడి డాక్టర్‌ శ్రీహరిరావు తలపై గట్టిగా ఎక్కువ సార్లు మోదటంతో అధికంగా రక్తస్రావం అయి ఇంటర్నల్‌ హెమరేజ్‌ జరిగి శ్రీహరిరావు మృతి చెందినట్లుగా పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైనట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవివకుమార్‌ తెలిపారు. 


తెలిసిన వారి పనేనా?

ఫిబ్రవరి 24వ తేదీన శ్రీహరిరావు మినహా మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంటిలో లేరని, ఆ సమయంలో ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన అగంతకుడు మళ్లీ 10 నెలల తర్వాత గత నెల 27వ తేదీన శ్రీహరిరావు కుటుంబ సభ్యులు అందరూ ఊరిలో లేకపోవటం, శ్రీహరి రావు ఒంటరిగా ఉండటం గమనించే హంతకుడు ఇంటిలోకి జొరబడి చేశాడమంటే పూర్తిగా తెలిసిన వారు చేసిన పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఇంటిలో దాదాపు రూ. 11 లక్షల మొత్తంతోపాటు పసుపు అమ్మగా వచ్చిన డబ్బు కూడా పెద్ద ఎత్తున ఉందని, ఈ మొత్తాన్ని దోచుకునేందుకే హత్య చేశారని భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన అగంతకుడు ఆధారాల విషయంలో మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడని, దీంతోనే సరైన వేలిముద్రలు గానీ, ఫుటేజ్‌ గానీ లభ్యం కాలేదని ఇందుకు నవంబరు 27వ తేదీ రాత్రి నివర్‌ తుఫాను కారణంగా పూర్తిగా ముసురు పట్టి ఉండటంతో అవనిగడ్డ ప్రధాన సెంటర్‌ చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో  చిత్రాలు అస్పష్టంగా ఉండటం కూడా హంతకుడికి కలిసివచ్చింది. 


ఆచూకీ చెప్తే నగదు బహుమతి

డాక్టర్‌ శ్రీహరిరావు హత్య కేసులో ఫిబ్రవరి 27వ తేదీన ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపైనే ఆధారాలు కేంద్రీకృతం కావటంతో అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50,000 నగదు బహుమతిని పోలీస్‌ శాఖ ప్రకటించినట్లు సీఐ భీమేశ్వర రవికుమార్‌ తెలిపారు. ఈ కేసును పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని ఆయన తెలిపారు. 


Updated Date - 2020-12-11T05:52:40+05:30 IST