హక్కులను కాపాడండి

ABN , First Publish Date - 2020-03-04T08:55:27+05:30 IST

‘సేవ్‌ అమరావతి’ నినాదంతో ఐదు కోట్ల ఆంరఽధుల కలల రాజధాని అమరావతిని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు రెండున్నర నెలలుగా అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) నాయకులు పోరాట పంథాను మార్చారు.

హక్కులను కాపాడండి

 ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, జాతీయ మహిళా కమిషన్‌లకు జేఏసీ వినతులు 

విజయవాడలో గవర్నర్‌ను కలిసి మహిళా జేఏసీ ప్రతినిధులు 


విజయవాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ‘సేవ్‌ అమరావతి’ నినాదంతో ఐదు కోట్ల ఆంరఽధుల కలల రాజధాని అమరావతిని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు రెండున్నర నెలలుగా అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) నాయకులు పోరాట పంథాను మార్చారు. గాంధేయ మార్గంలో శాంతియుత  ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం కొనసాగిస్తూనే.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) గౌరవ సలహాదారు జీవీఆర్‌ శాస్త్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, సభ్యుడు జస్టిస్‌ పి.సి.పంత్‌లను కలిసింది. అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) నాయకులు ఆర్‌.వి.స్వామి, ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ శైలజ, ప్రమీలారాణి, జమ్ముల శైలజ తదితరులు మానవ హక్కుల కమిషన్‌ సభ్యులను కలిసిన ప్రతినిధి బృందంలో ఉన్నారు. రాజధాని ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఉద్యమకారులపై పోలీసుల దమనకాండ, అక్రమ కేసుల నమోదు, మహిళలపై భౌతికదాడులకు పాల్పడుతున్న సంఘటనలను సచిత్రంగా వివరించారు.


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకున్న కమిషన్‌ చైర్మన్‌ స్పందిస్తూ.. వారం రోజుల్లోమానవ హక్కుల కమిషన్‌ తరపున ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్‌కు పంపుతామని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అనంతరం జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు అమరావతి ప్రాంతంలో పర్యటించారని, వారి విచారణ తీరు పట్ల తాము సంతోషంగా లేమని జేఏసీ నాయకులు మహిళా కమిషన్‌కు వివరించారు. అందుకు స్పందించిన కమిషన్‌ చైర్‌పరన్‌ మళ్లీ సభ్యులను పంపించి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు చెప్పారు. 


గవర్నరుకు వినతి

రాష్ట్రంలో మహిళా జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారని, శాంతియుతంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలపై వైసీపీ నాయకులు భౌతికదాడులకు పాల్పడుతున్నారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. మహిళా జేఏసీ ప్రతినిధులు సుంకర పద్మశ్రీ, గద్దె అనురాధ, అక్కినేని వనజ, జి.జ్యోత్స్న, డాక్టర్‌ సరిత, పి.దుర్గాభవాని, వి.అనిత, ఎన్‌.మాలతి, కె.నాగలక్ష్మి, ఆర్‌.సౌజన్య, బి.పద్మ తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు. 

Updated Date - 2020-03-04T08:55:27+05:30 IST