రైతుకు బాసటగా వైద్యులు
ABN , First Publish Date - 2020-03-02T10:06:58+05:30 IST
‘ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మరొక ప్రభుత్వం అన్యాయం చేయడం సరికాదు.. చంద్రబాబుకు పేరొస్తుందని అమరావతిలో రాజధానినే లేకుండా చేయాలనుకోవడం..

విజయవాడ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ‘ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మరొక ప్రభుత్వం అన్యాయం చేయడం సరికాదు.. చంద్రబాబుకు పేరొస్తుందని అమరావతిలో రాజధానినే లేకుండా చేయాలనుకోవడం.. రాష్ట్ర అభివృద్ధిని, భావితరాల భవిష్యత్తును నాశనం చేయడం దుర్మార్గం..’ అంటూ వైద్యులు గళమెత్తారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ‘మేము సైతం..’ అంటూ పిడికిలి బిగించారు. ‘సేవ్ అమరావతి’ నినాదంతో 75 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా.. అమరావతి పరిరక్షణకు కృషి చేస్తామంటూ వివిధ కార్యక్రమాల నిర్వహణకు చేయిచేయి కలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ‘జేఏసీ’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఒక హోటల్‌లో ‘డాక్టర్స్ మీట్’ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తెనాలి, మంగళగిరి పట్టణాల నుంచి డాక్టర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ‘అమరావతి పరిరక్షణ ఉద్యమంలో వైద్యుల పాత్ర’ గురించి చర్చించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో పలువురు డాక్టర్లు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
ఇవీ తీర్మానాలు
డాక్టర్స్ రౌండ్‌టేబుల్ సమావేశంలో అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన తర్వాత ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను కూడా ఆమోదించారు. ఆ తీర్మానాలు ఇవి..
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేయాలి
అమరావతి పరిరక్షణ కోసం ప్రజల నుంచి పెద్దఎత్తున సంతకాలు సేకరించి రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపించాలి.
రాజధాని ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి
ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలపై నమోదు చేసిన కేసులను తొలగించాలి.
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఆర్థిక తోడ్పాటునందించేందుకు విరాళాల సేకరణ
రాజధాని ప్రాంతంలో ఇటీవల పర్యటించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలి.