శాటిలైట్‌ రైల్వేస్టేషన్లుగా .. గుణదల, రామవరప్పాడు !

ABN , First Publish Date - 2020-03-18T09:56:17+05:30 IST

దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడపై రైల్వేశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

శాటిలైట్‌ రైల్వేస్టేషన్లుగా .. గుణదల, రామవరప్పాడు !

సిటీలో గుణదల, ఔటర్‌లో రామవరప్పాడులకు రైల్వే ప్రతిపాదనలు 

రైల్వే బోర్డు నుంచి సానుకూల సంకేతాలు 

అనుమతులు ఇస్తే.. యుద్ధ ప్రాతిపదికన పనులు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడపై రైల్వేశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్‌పై రద్దీని తగ్గించటంతో పాటు, ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవటానికి మరిన్ని శాటిలైట్‌ రైల్వేస్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలనుకుంది. ఇందులో భాగంగా  నగర పరిధిలో గుణదల రైల్వేస్టేషన్‌ను,  ఔటర్‌ పరిధిలో రామవరప్పాడు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


ఇప్పటికే వీటిని విజయవాడ - గుడివాడ, గుడివాడ - మచిలీపట్నం, గుడివాడ - నర్సాపురం రైల్వే డబ్లింగ్‌ - ఎలక్ర్టిఫికేషన్‌లో భాగంగా అభివృద్ధి చేపడుతున్నారు. నిడమానూరు నుంచి రామవరప్పాడు మీదుగా గుణదల దాటి మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ , సింగ్‌నగర్‌ ప్రాంతం వరకు డబుల్‌గా ఉన్న ట్రాక్స్‌ను వాటి వద్ద నాలుగు ట్రాక్‌లుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు.  ఇవి కొత్త కళను సంతరించుకుంటున్నాయి. 


రైల్వే బోర్డుసానుకూలం

శాటిలైట్‌ స్టేషన్లపై డీఆర్‌ఎం శ్రీనివాస్‌ కొద్ది కాలం కిందట రైల్వేబోర్డుకు ప్రతిపాదించారు. బోర్డు సానుకూలంగా ఉండటంతో వీటి అభివృద్ధి ఖాయమని తెలుస్తోంది. విజయవాడ ప్రధాన ఏ 1 రైల్వేస్టేషన్‌ మీద పడుతున్న రద్దీ ని నివారించటం కోసం గతంలో రైల్వే డివిజినల్‌ అధికారులు రాయనపాడును శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గతంలో ప్రజాప్రతినిధులు గుణదల రైల్వేస్టేషన్‌ను శాటిలైట్‌ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో రైల్వే అధికారులు వినలేదు. రాయనపాడును శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు విజయవాడ స్టేషన్‌కు రాకుండా నేరుగా రాయనపాడు వచ్చి ఆగేలా అవకాశం కల్పించారు.


నగరంలోని ప్రయాణికులు.. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయనపాడు నుంచి రావటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.  రైల్వే కార్మిక సంఘాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పు పట్టాయి.  ప్రస్తుత  రైల్వే ఉన్నతాధికారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. నగరంలోనే మరో స్టేషన్‌ను శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. నగరంలో గుణదల, మధురానగర్‌ స్టేషన్లు ఉన్నాయి. గుణదల రైల్వేస్టేషన్‌ అయితే సబబుగా ఉంటుందని నిర్ణయించారు. ఇటు ఏలూరు రోడ్డుకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా కనెక్ట్‌ అవుతుందని, మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు కనెక్ట్‌ కావడంతొ నగరంలోని సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తేలిగ్గా ఉంటుందని భావించారు. 


తూర్పు నియోజకవర్గంతో పాటు సమీప గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే రూరల్‌ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నగరం బయట రామవరప్పాడు రైల్వేస్టేషన్‌ను కూడా శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైల్వే అధికారులు వెంటనే ప్రతిపాదనలను రైల్వేబోర్డు ముందుంచారు. అనుమతులు రాకపోయినా సానుకూలంగా ఉండటంతో అతి త్వరలోనే అనుమతులు వస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. 


గుణదల, రామవరప్పాడు రైల్వేస్టేషన్లకు పెరగనున్న ప్రాధాన్యం

రైల్వే డివిజన్‌ అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో గుణదల , రామవరప్పాడు రైల్వేస్టేషన్లకు ప్రాధాన్యం మరింత పెరగనుంది. ఇవి నిత్యం ప్రయాణికులతో క ళకళలాడనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్స్‌ కూడా ఇక్కడ ఆగనున్నాయి. దీంతో పాటు ప్లాట్‌ఫామ్‌లు అభివృద్ధి చెందుతాయి.


శివారు వరకు వచ్చిన రైలు స్టేషన్‌కు రావాలంటే మాత్రం కనీసం అరగంట సమయం పడుతుంది. ఔటర్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోతే సమయం వృఽథాఅవుతుంది. గుణదలలో అయితే ఎంచక్కా దిగిపోవచ్చు. మచిలీపట్నం - గుడివాడలకు విజయవాడ నుంచి ఎక్కువగా రాకపోకలు ఉంటాయి. ఇప్పటి వరకు రామవరప్పాడు నుంచి కేవలం ప్యాసింజర్లకు మాత్రమే అవకాశం ఉండేది. ఇకపై ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనే ఇక్కడి నుంచి ప్రయాణించవచ్చు. 


ఇప్పటికే స్టేషన్ల అభివృద్ధి : 

గుణదల, రామవరప్పాడు స్టేషన్లను  ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ - గుడివాడ, విజయవాడ - మచిలీపట్నం, గుడివాడ - నర్సాపూర్‌ డబ్లింగ్‌  , విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా రైల్వేస్టేషన్లలో కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. దీనికి తోడు ఎలక్ర్టిఫికేషన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. వీటితో పాటు నాలుగు ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. 

Updated Date - 2020-03-18T09:56:17+05:30 IST