కరోనా వైరస్‌పై పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-19T10:25:47+05:30 IST

కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా పుకార్లు, అపోహలు, భయాందోళనలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు.

కరోనా వైరస్‌పై  పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు

ఈనెల 31 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు

పోలీసులకు ప్రత్యేక దుస్తులు

కరోనా నివారణ సేవలందించేందుకు ప్రత్యేక బృందాలు

విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 600 మంది

కరోనా టోల్‌ ఫ్రీ నెంబరు 94910 58200

ప్రత్యేక అంబులెన్స్‌లు సిద్ధం

అవసరమైతే హౌస్‌ అరెస్ట్‌

రద్దీ ప్రాంతాల్లో వాష్‌ బేసిన్‌, సబ్బులు ఏర్పాటు


వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఇంతియాజ్‌


విజయవాడ సిటీ, మార్చి 18 : కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా పుకార్లు, అపోహలు, భయాందోళనలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ హెచ్చరించారు. ఏపీడెమిక్‌ డీసీజ్‌ యాక్ట్‌ 1897, ప్రభుత్వం కరోనా వైరస్‌ డీసీజ్‌-19 కింద విడుదల చేసిన నిబంధనలు, అధికారాలను స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌.. వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవో, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్యాధికారులకు వివరించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఏ వ్యక్తి, సంస్థ, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌, సోషల్‌ మీడియాల్లో ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఉపయోగించకూడదన్నారు. పుకార్లు వ్యాప్తిచేస్తే శిక్షానేరంగా పరిగణిస్తామని చెప్పారు. వైరస్‌ నిర్ధారణ కోసం నమూనాలను తీసుకోవడం, పరీక్షలకు ఏ ల్యాబ్‌కు అనుమతిలేదని చెప్పారు. విదేశాల నుంచి జిల్లాకు 600 మంది వచ్చారని, వీరితో పాటు వచ్చిన వారి వివరాలను గ్రామ వలంటీర్ల ఇంటింటి సర్వే ద్వారా తెలుసుకుంటామన్నారు. 


ఫీల్డ్‌ సర్వేలైన్స్‌ టీమ్‌ల ఏర్పాటు

గ్రామస్థాయిలో పర్యవేక్షణకు ఫీల్డ్‌ సర్వే లైన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశామని, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఈ టీమ్‌లు పనిచేస్తాయని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో కరోనా కేసు నమోదు కానప్పటికీ దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు యుద్ధ్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు, పారామెడికల్‌ సిబ్బందితో కూడిన 15 రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 94910 58200 నెంబర్‌తో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, దీనికి అదనంగా విజయవాడలో మరో కాల్‌ సెంటర్‌ను (0866-2410978) ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో ల్యాబ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 19 ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుచేసి ప్రత్యేక బెడ్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు.


విజయవాడ విమానాశ్రయంలో ప్రత్యేక కార్వెన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. అనుమానితులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్సులు సిద్ధంగా ఉంచామని కలెక్టర్‌ వివరించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తే వెంటనే సమీప వైద్యాధికారులకు సమాచారం  ఇవ్వాలని, విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు వారి ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచాలని, మరో 14 రోజులు వారు ఇంటిలోనే ఉండేలా చూడాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు అప్పగించాలని తెలిపారు. ఈ చర్యలకు సహకరించని వారిని నిబంధనల మేరకు హౌస్‌ అరెస్టు చేసేందుకు వెనుకాడవద్దన్నారు. రైతు బజార్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తాత్కలిక వాష్‌ బేసిన్‌, సబ్బు అందుబాటులో ఉంచాలన్నారు. మాల్స్‌ తదితర వాణిజ్య సముదాయాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.


నాలుగు దశల్లో వ్యాప్తి

కొవిడ్‌-19 నాలుగు దశల్లో వ్యాపిస్తుందని, విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వారికి మొదటి దశలో ఉంటుందని, వారి నుంచి వారి కుటుంబసభ్యులకు రెండోదశలో వ్యాపిస్తుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యుల నుంచి వేరే వారికి మూడోదశలో వ్యాప్తి చెందుతుందని, వారి నుంచి ఇతరులకు అతి వేగంగా నాల్గో దశలో చేరుతుందని కలెక్టర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులకు ఆదివారం, ఇతర సెలవు దినాల్లో ఎటువంటి పర్మిషన్లు, సెలవులు మంజూరు చేయబడవన్నారు. ప్రతి ఒక్క అధికారి అందుబాటులో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మాధవీలత, జేసీ-2 మోహన్‌కుమార్‌, డీఆర్వో, ప్రసాద్‌,  సబ్‌కలెక్టర్‌ ధ్యానచంద్ర, డీఎంహెచ్‌వో టీఎస్‌ఆర్‌ మూర్తి, డీపీవో వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T10:25:47+05:30 IST