600మంది ఔట్!
ABN , First Publish Date - 2020-08-20T13:48:41+05:30 IST
కరోనా కష్టకాలంలో ఆర్టీసీ.. ఉద్యోగులపై..

ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులపై వేటు
కృష్ణా రీజియన్‌లోని 14 డిపోల్లో పనిచేసే వారికి మంగళం
ఆఫీసుల్లో పనిచేసే వారిపైనా వేటు
కరోనా సమయంలో ఉద్యోగుల కలవరం
విజయవాడ, ఆంధ్రజ్యోతి: కరోనా కష్టకాలంలో ఆర్టీసీ.. ఉద్యోగులపై కక్ష తీర్చుకుంది. రీజియన్‌లోని 600మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఉన్నపళంగా ఉద్వాసన పలికింది. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన యాజమాన్యం తమను ఇలా బయటకు గెంటితే పరిస్థితి ఏమిటని.. జీవనాధారం ఎలా..? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో విధులు నిర్వహిస్తున్న 600 మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఆర్టీసీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చిందే యాజమాన్యం. ఇలా ఉద్యోగులను తీసుకోవటం వల్ల వారితో పాటు సంస్థ కూడా నిర్వీర్యమవుతుందని, ఎవరినైనా తీసుకోవాలంటే రెగ్యులర్‌గానే నియామకాలు జరపాలని అప్పట్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్పినా వినలేదు. కాలక్రమంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సంస్కృతి విస్తరించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన పనులు చేసే స్థాయికి వారు చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పీటీడీలో విలీనమయ్యే పరిస్థితుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తమను కూడా రెగ్యులరైజ్ చేస్తారని ఆశించారు. అలా జరగలేదు. పోనీ.. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే అందులో అయినా అవకాశం వస్తుందనుకుంటే అదీ లేదు. దీంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న దశలో కరోనా మరింత ప్రమాదంలోకి నెట్టింది.
ఆర్టీసీకి జీతాలు భారమనే..!
రెగ్యులర్ ఉద్యోగులంతా పీటీడీలో విలీనం కావటం వల్ల మిగిలిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన భారం ఆర్టీసీపై పడింది. పీటీడీలో విలీనమైన వారికి ప్రభుత్వం జీతాలు ఇస్తుండగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఆర్టీసీ చెల్లిస్తోంది. దీంతో వీరిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నారు. సిబ్బందిని తొలగించటానికి జోనల్, రీజనల్ స్థాయిలో అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో ఆ దిశగా కసరత్తు జరిగింది. ముందుగా గ్యారేజీలపై దృష్టిపెట్టారు.
కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు సైతం తొలగింపు
గ్యారేజీలు, ఆఫీసుల్లో పనిచేసే వారితో పాటు ఆపరేషన్స్ విభాగంలో పనిచేసే కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లపై కూడా ఆర్టీసీ అధికారులు వేటు వేశారు. వీరిని గతంలో రోస్టర్ పాయింట్లను బట్టి సంస్థలోకి రిక్రూట్ చేసుకున్నారు. ఇలా వచ్చిన వారిలో రిమూవ్ అయి తిరిగి మళ్లీ వచ్చినవారు కూడా ఉన్నారు. వీరంతా కూడా పీటీడీలో విలీనం కాలేదు కాబట్టి తొలగించారు.
అటు వేటు.. ఇటు అలవెన్సులు..
ఒకవైపు సంస్థకు భారంగా మారుతున్నారని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుంటే.. మరోవైపు అధికారులకు మాత్రం పీటీడీలో రూ.30వేల అలవెన్సుల సదుపాయం కల్పించారు. ఆర్టీసీలో ఉన్నపుడు కారు సదుపాయం ఉండేది. ఆ పేరుతో అలవెన్స్ ఉండేది. దీనిని పాత ఎండీలు మాలకొండయ్య, సురేంద్రబాబు రద్దు చేశారు. ప్రస్తుతం అధికారులు పీటీడీలో కొనసాగుతున్నందున ప్రభుత్వమే కదా ఖర్చు భరించేదన్న ఉద్దేశంతో మళ్లీ రూ.30వేల అలవెన్సు సదుపాయాన్ని కల్పించారు.
గ్యారేజీలే ఎందుకు టార్గెట్..?
ఆర్టీసీ గ్యారేజీల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో కృష్ణా రీజియన్ చూపు ఆ విభాగంపై పడింది. గ్యారేజీల్లో సగటున 40 మంది చొప్పున కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది. రీజియన్‌లో 14 డిపోలు ఉన్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, గుడివాడ, మచిలీపట్నం, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, గవర్నర్ పేట-1, 2, ఆటోనగర్, గన్నవరం, ఉయ్యూరు బస్ డిపోల పరిధిలోని 600 మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టీసీ అధికారులు తొలగించారు. ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపైనా ఆర్టీసీ అధికారులు వేటు వేశారు.