ఆర్టీసీలో విశ్రాంత ‘జైలు’!

ABN , First Publish Date - 2020-06-11T16:42:19+05:30 IST

ఊరంతా ఒకదారి అయితే ఉలిపి పిట్టది మరో దారి అన్నట్టుంది కరోనా కాలంలో..

ఆర్టీసీలో విశ్రాంత ‘జైలు’!

ఖాళీగా కూర్చుంటున్నారని గదిలో కుక్కేస్తున్న వైనం

భౌతిక దూరం శూన్యం.. ఎటూ కదలలేని దైన్యం

ఖైదీల్లా ఉండలేమంటున్న సిబ్బంది


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఊరంతా ఒకదారి అయితే ఉలిపి పిట్టది మరో దారి అన్నట్టుంది కరోనా కాలంలో ఆర్టీసీ యాజమాన్యం వైఖరి. సిబ్బంది ఖాళీగా కూర్చుంటున్నారని పిలిచి మరీ ఇరుగ్గా ఉన్న విశ్రాంత గదుల్లో కుక్కేస్తోంది. కాదు.. కాదు గదుల్లో ఖైదు చేస్తోంది! బస్సులు తక్కువగా తిరగడం, కొందరికే పని ఉండటంతో మిగిలిన వారితో సంతకాలు పెట్టించి గదుల్లోకి నెడుతోంది. ఉదయం వచ్చి సంతకం పెట్టి డ్యూటీ అవర్‌ పూర్తయ్యేదాకా కూర్చోబెట్టి సమయం ముగిశాక పంపుతోంది. ఇలా అందరూ ఒకేచోట ఉండటం వల్ల భౌతిక దూరం పాటింపు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఎవరికీ చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


సబర్బన్‌ పరిధిలో బస్సులు తిరగటం లేదు. ఆర్టీసీ సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తోంది. అందుకు ఇష్టపడని ఆర్టీసీ అధికారులు వీరికి ఎక్కడో ఒకచోట డ్యూటీలు వేస్తే బాగానే ఉంటుంది. ఖాళీగా ఉన్నారన్న ఉద్దేశంతో డిపోలకు పిలిచి సంతకం చేయించి పది మంది కూడా పట్టని గదుల్లో వారి డ్యూటీ టైమ్‌ వరకు ఉంచి పంపుతున్నారు. ఇలా ఇరుకు గదుల్లో కిక్కిరిసి ఉక్కిపోతూ సాయంత్రం వరకు జైలులో ఖైదీలా బతుకు జీవుడా అంటూ గడపాల్సి వస్తోంది. నగర డివిజన్‌ పరిధిలోని గవర్నర్‌ పేట-1, విద్యాధరపురం, గవర్నర్‌ పేట-2, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉయ్యూరు, ఆటోనగర్‌ బస్‌ డిపోలలో ఈ పరిస్థితి నెలకొంది.


ఒక్కో డిపోకు హీనపక్షంగా 300 నుంచి గరిష్టంగా 700 మంది వరకు సిబ్బంది ఉన్నారు. సిటీ డివిజన్‌ పరిధిలో మొత్తంగా 3వేల మంది ఉన్నారు. సిటీ బస్సులు తిరగకపోవటంతో దాదాపుగా డ్రైవర్లు, కండక్టర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వీరు ఖాళీగా ఉంటున్నారన్న పేరుతో డిపోలకు పిలిచి సోషల్‌ డిస్టెన్స్‌ లేకుండా గదుల్లో ఉంచే బదులు.. క్షేత్ర స్థాయిలో ఏదైనా డ్యూటీలు చేయిస్తే స్వామికార్యం నెరవేరినట్టు అవుతుంది. సిటీ డిపోల పరిధిలోని 3వేల మంది సిబ్బందిలో 90శాతం మంది ఖాళీగానే ఉంటున్నారు. పది శాతం మందికి బస్‌స్టేషన్ల ప్లాట్‌ఫామ్‌ల దగ్గర దూర ప్రాంతాలు, జిల్లా సర్వీసులకు టిక్కెటింగ్‌ జారీ, థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌, పోలీసు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించటానికి కేటాయిస్తున్నారు. మిగిలిన 90శాతం మంది సిబ్బంది ఇలా డిపోలలో ఇరుకు గదుల్లో ఖైదు కావాల్సి వస్తోంది.


స్టాఫ్‌ రూమ్‌లు చాలా ఇరుగ్గా ఉంటాయి. బస్సులు రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఈ స్టాఫ్‌ రూమ్‌లలో పది మందికి మించి ఉండేవారు కాదు. ఏ సమయంలోనైనా బస్సులు రన్నింగ్‌లో ఉండటం వల్ల తక్కువ సిబ్బంది మాత్రమే రెస్ట్‌లో ఉండటం వల్ల ఈ గదులు పెద్దగా ఇరుగ్గా అనిపించేవి కావు. కానీ ప్రస్తుతం 90 శాతం మంది స్టాఫ్‌ ఉండటంతో గదులు కిక్కిరిసి ఊపిరి సలపలేనంతగా తయారౌతున్నాయి. ఇలాంటి గదుల్లో కూర్చోవటం పట్ల కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా సీజన్‌లో ఇలా భౌతిక దూరం లేకుండా కూర్చోవటం ప్రాణాల మీదకు తెస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.


మహిళా కండక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకే బెర్తు మీదు ఐదుగురు అంతకు మించి కూర్చోవాల్సి వస్తోంది. ఏమి చేస్తాం మా ఖర్మ అంటూ తలబాదుకుంటున్నారు. వీరికి మంచినీటి వసతి సదుపాయం సరిగ్గా లేదు. బాత్రూమ్‌లూ శుభ్రంగా లేవు. లోపల ఊపిరి ఆడటం లేదని బయటకు వస్తే.. సూపర్‌ వైజర్లు, ఎస్టీఐలు, కంట్రోలర్లు వారిని వెంబడించడం, పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారా అని అడగటం పరిపాటిగా మారుతోంది.  కరోనా లక్షణాలున్న వారు ఒక్కరున్నా.. అందరికీ తేలిగ్గా వ్యాపిస్తుంది. ఇదే జరిగితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.


Updated Date - 2020-06-11T16:42:19+05:30 IST