ఇదేం ద్వంద్వనీతి..! ఆర్టీసీకో న్యాయం.. ప్రైవేటుకో న్యాయమా..?

ABN , First Publish Date - 2020-06-26T17:22:15+05:30 IST

మోటారు వాహనాల చట్టంలో ప్రభుత్వానికో నిబంధనలు, ప్రైవేట్‌కో నిబంధనలు ఉండవు. ప్రైవేట్‌ సంస్థలు చేస్తే తప్పైనపుడు ప్రభుత్వం చేస్తే ఒప్పయిపోతుందా..? ప్రస్తుతం ఆర్టీసీలో అదే జరుగుతోంది.

ఇదేం ద్వంద్వనీతి..! ఆర్టీసీకో న్యాయం.. ప్రైవేటుకో న్యాయమా..?

విజయవాడ కేంద్రంగా ఆర్టీసీ స్క్రాప్‌ బస్సుల ఫ్యాబ్రికేషన్‌

రవాణా శాఖకు తెలియకుండానే దొడ్డిదారి నిర్వాకం

తుక్కయిన బస్సులను కార్గో వ్యాన్లు, కంటైనర్లుగా మార్చేస్తున్న వైనం

అనంతపురంలో మాత్రం హడావిడి చేసిన రవాణా అధికారులు

ఇక్కడ తమకు తెలియదంటూ తప్పించుకునే ధోరణి


ఆంధ్రజ్యోతి, విజయవాడ : మోటారు వాహనాల చట్టంలో ప్రభుత్వానికో నిబంధనలు, ప్రైవేట్‌కో నిబంధనలు ఉండవు. ప్రైవేట్‌ సంస్థలు చేస్తే తప్పైనపుడు ప్రభుత్వం చేస్తే ఒప్పయిపోతుందా..? ప్రస్తుతం ఆర్టీసీలో అదే జరుగుతోంది. అక్కడెక్కడో అనంతపురం జిల్లాలో తుక్కు బస్సుల వ్యవహారాన్ని నిగ్గుదేల్చిన రవాణా శాఖకు విజయవాడ నడిబొడ్డున ఆర్టీసీ స్క్రాప్ బస్సుల ఫ్యాబ్రికేషన్‌ విషయం మాత్రం తెలియదట. ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఇది నిజం. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ స్క్రాప్ ‌గా నిర్ధారించి విక్రయించిన 154 బీఎస్‌-3 చట్టవిరుద్ధంగా బీఎస్‌-4 వాహనాలుగా చూపుతూ రిజిస్ట్రేషన్‌ చేయించారని, నకిలీ ఇన్సూరెన్స్‌, ఫోర్జరీ ఎన్‌వోసీలతో వాటిని విక్రయించారన్న ఆరోపణ లపై రవాణా శాఖ అధికారులు అనంతపురం జిల్లాలోని వన్‌టౌన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిపై ఫిర్యాదుచేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కానీ, విజయవాడ ఆర్టీసీ వర్క్‌షాపు కేంద్రంగా స్క్రాప్ బస్సుల ఫ్యాబ్రికేషన్‌ జరుగుతుంటే తమకు తెలియదంటూ తేలిగ్గా తీసిపడేశారు. 


విజయవాడలో యథేచ్ఛగా..

విజయవాడ జోన్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్లలో 24 ఏసీ బస్సులు, 140 నాన్‌ ఏసీ బస్సులు మొత్తం 164 బస్సులు స్క్రాప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీటిలో కండీషన్‌లో ఉన్నాయన్న పేరుతో 63 బస్సులను ఫ్యాబ్రికేషన్‌ చేయాలని నిర్ణయించారు. ఇందులో డజనుకుపైగా స్క్రాప్ బస్సుల చాసిస్‌లను పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. వీటికి బాడీ బిల్డింగ్‌ చేయటమే తరువాయి. తుక్కుకు పంపాల్సిన బస్సుల రూపుమార్చే ఆర్టీసీ ప్రయత్నంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. విజయవాడ కేంద్రంగా వర్క్‌షాపులో ఆర్టీసీ స్క్రాప్ బస్సుల నుంచి చాసిస్‌లను వేరుచేసి వాటికి ఇంజన్లు, గేర్‌ బాక్సులు, ఫ్రంట్‌ యాక్సిల్‌, రేర్‌ యాక్సిల్‌, స్టీరింగ్‌ బాక్స్‌, సెల్ఫ్‌ స్టార్టర్‌, ఆల్టర్‌నేటర్‌లను అమర్చటంతో పాటు పూర్తిస్థాయి చాసిస్‌లను సిద్ధం చేస్తున్నారు. వీటిని త్వరలో కార్గో వ్యాన్లు/కంటైనర్లు, ట్రైనింగ్‌ వెహికల్స్‌ గా ఉపయోగించనున్నారు. వాస్తవానికి స్క్రాప్ బస్సుల విషయాన్ని రవాణా శాఖ దృష్టికి తెచ్చి, ఆక్షన్‌ నిర్వహించి, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించుకోవాలి. ఇందుకు భిన్నంగా ఆర్టీసీ అధికారులు స్ర్కాప్‌ బస్సుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించకుండానే వాటిని ఫ్యాబ్రికేషన్‌ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ చర్యల వల్ల రవాణా రికార్డుల పరంగా పాత బస్సుల రిజిస్ట్రేషన్‌ను నెంబర్లు అలాగే కొనసాగుతాయి. కాకపోతే బస్సుల స్వరూపమే మారిపోతుంది. 


రిజిస్ట్రేషన్‌ జరగదనే..

రూపాంతరం చెందిన కార్గో వ్యాన్లు, ట్రైనింగ్‌ వెహికల్స్‌ పాత రిజిస్ర్టేషన్‌ నెంబర్లతోనే కొనసాగుతాయి. వాస్తవానికి మార్చి 31వ తేదీతో బీఎస్‌-4 వాహనాల రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయి. వీటిని ఎవరైనా కొన్నా రిజిస్ర్టేషన్‌ చేయరు. ఆర్టీసీ వేరు చేస్తున్న చాసిస్‌లలో పాత బీఎస్‌-3 ఇంజన్లను అమర్చాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. స్ర్కాప్‌ బస్సుల రిజిస్ర్టేషన్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే, బీఎస్‌-3 ఇంజన్లతో మళ్లీ వాటికి రిజిస్ర్టేషన్‌ జరగదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ తెలివిగా స్ర్కాప్‌ బస్సుల విషయాన్ని రవాణా శాఖ దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. 


మా దృష్టికి రాలేదు : ఎస్‌.వెంకటేశ్వరరావు, డీటీసీ

స్క్రాప్ బస్సుల ఫ్యాబ్రికేషన్‌ గురించి మాకు తెలియపరచలేదు. దీనిపై పరిశీలిస్తాం. మోటారు వెహికల్‌ చట్టం ఎవరికైనా ఒకటే. 

Updated Date - 2020-06-26T17:22:15+05:30 IST