ప్రమాదకర ప్రగతి రథ చక్రాలు
ABN , First Publish Date - 2020-12-20T05:39:54+05:30 IST
ప్రమాదకర ప్రగతి రథ చక్రాలు

పదేపదే రీ-బటన్.. ఆనక రీ-క్యాపింగ్..
ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం
పాత బస్సులకు అరిగిపోయిన చక్రాల వినియోగం
ప్రమాదకరమేనంటున్న డ్రైవర్లు
అసలే కాలం చెల్లిన బస్సులు.. వాటికి తోడు అరిగిపోయిన టైర్లపై కరిగించి వేసిన పూతలు.. ఖర్చును వెనకేసుకుంటూ రీ-బటన్, రీ-క్యాపింగ్ పేరుతో ఆర్టీసీ అధికారులు చేస్తున్న ఈ ప్రమాదకర ప్రయత్నాలపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సురక్షితం కాదంటున్నారు.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : నగరంలో మూడొంతుల బస్సులు స్ర్కాప్‌నకు వెళ్లాల్సినవే. అయినా.. వాటిని కొనసాగిస్తున్నారు. కనీసం వాటి నిర్వహణను కూడా సక్రమంగా చూడట్లేదు. ఆర్టీసీ కృష్ణా రీజియన్ పరిధిలోని 14 బస్ డిపోల్లోని బస్సులకు అరిగిపోయిన టైర్లను ఉపయోగిస్తున్నారు. ఒక బస్సు 8 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంది. ఆర్టీసీలో అయితే దానిని 10 నుంచి 15 లక్షల కిలోమీటర్ల వరకు కూడా ఉపయోగిస్తారు. బస్సుకు ఉపయోగించే ఒక కొత్త టైరు ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి, రోడ్డు ఉపరితలాన్ని బట్టి సగటున 1.40 లక్షల కిలోమీటర్ల నుంచి 2.50 లక్షల కిలోమీటర్ల వరకు వస్తుంది. అంటే.. ఆర్టీసీ ఉపయోగించే 10 లక్షల కిలోమీటర్ల వినియోగానికి ఐదుసార్లు టైర్లను మార్చాల్సి ఉంటుంది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆర్టీసీ బస్సుల మాదిరిగా టైర్లను కూడా మార్చిమార్చి ఉపయోగిస్తున్నారు. ఇందుకు రీ-బటన్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. టైర్ల రీ-బటన్ వరకు సమస్య లేదు. కొత్తగా రీ-క్యాపింగ్ చేస్తున్నారు. ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతోంది.
రీ-క్యాపింగ్ అంటే..
ఒక బస్సుకు ఉన్న కొత్త టైర్లు అరిగిపోతే రీ-బటన్‌కు ఇస్తారు. దీనిద్వారా టైరుకు రింగ్ మాదిరిగా ఒక తొడుగుతో లేయర్ వేస్తారు. దీనిని ఒకసారి చేశాక ఆ టైరును స్ర్కాప్‌కు పంపించేయాలి. టైర్ దృఢత్వాన్ని బట్టి రెండోసారి కూడా రీ-బటన్ చేయొచ్చు. కానీ, ఆర్టీసీ అధికారులు నాలుగైదు సార్లు రీ-బటన్ చేస్తున్నారు. దీనిద్వారా ఆ టైర్ దృఢత్వాన్ని కోల్పోతుంది. కానీ, ఆర్టీసీ అధికారులు వాటిని రీ-క్యాపింగ్ చేయిస్తున్నారు. రీ-క్యాపింగ్ అంటే.. డ్యామేజీల చోట పూత వేయటం. ఇలా టైర్ మొత్తానికి ఎన్నిచోట్ల డ్యామేజీ ఉంటే అన్నిచోట్ల పూతలు వేస్తారు. ఇలా రీ-క్యాపింగ్ చేసిన టైర్లను పదేపదే ఉపయోగించాక కూడా మళ్లీ వినియోగిస్తున్నారు. ఇప్పుడీ రీ-క్యాపింగ్ టైర్ల పూత విచ్ఛిన్నమై పేలటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రీ-క్యాపింగ్ పేకప్‌ల కారణంగా డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
ముందు చక్రాలకూ రీ-క్యాపింగ్
సాధారణంగా కొత్త టైర్లను, దృఢంగా ఉన్న టైర్లను బస్సు ముందు భాగంలో ఏర్పాటు చేస్తారు. వెనుక భాగంలో రెండేసి టైర్ల చొప్పున మొత్తం నాలుగు టైర్లు ఉంటాయి కాబట్టి రీ-క్యాపింగ్ ఏమైనా ఉంటే వెనుక సర్దుబాటు చేస్తారు. ఒకటి పేలినా మరొకటి సపోర్టుగా ఉండటం వల్ల ప్రమాదం ఉండదు. ప్రస్తుతం రీ-క్యాపింగ్ టైర్లను ముందు చక్రాలకు అమర్చుతున్నారు. అవి పేలితే ప్రమాదాలు జరుగుతాయన్నది డ్రైవర్ల వాదన.
యూనియన్ ఏర్పాటు దిశగా డ్రైవర్లు
తమ సమస్యలను పట్టించుకోకపోవటంతో యూనియన్ ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్లు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రశ్నించే డ్రైవర్లను డిపో అధికారులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా యూనియన్ ఏర్పాటు చేసుకుని ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
