మరింత ఉధృతం.. అమరావతి సాధనే ఉద్యమ లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-11T07:06:12+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి ఈనెల 17వ తేదీకి ఏడాది.

మరింత ఉధృతం.. అమరావతి సాధనే ఉద్యమ లక్ష్యం
రౌండ్‌టేబుల్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న సీపీఐ నేత రామకృష్ణ. పక్కన అమరావతి జేఏసీ, అఖిలపక్ష నేతలు

ఉద్యమానికి ఏడాది

కార్యాచరణపై రౌండ్‌టేబుల్‌

12, 15 తేదీల్లో పాదయాత్రలు

17న చలో అమరావతి


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి ఈనెల 17వ తేదీకి ఏడాది. ఆ ప్రకటనతో రాజధాని గ్రామాల్లో  రైతులు, మహిళలు, యువకులు ఆవేదనతో రోడ్డెక్కారు. ఇది జరిగి, ఈ నెల 17వ తేదీకి ఏడాది. ఈ తరుణంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. 


విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని విజయవాడలో జరిగిన  అఖిలపక్షాల సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఉద్యమప్రణాళికను రూపొందించారు. బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని లారీ ఓనర్స్‌ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాల నేతలూ, వివిధ రంగాల, సంఘాల నేతలు హాజరై వారివారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


ఇదీ కార్యాచరణ..

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు శుభం కల్యాణ మండపం నుంచి లక్ష్మీపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు, 15వ తేదీన విజయవాడ పడవలరేవు నుంచి మీసాల రాజేశ్వరరావు వంతెన వరకు ప్రజాపాదయాత్రను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. 17వ తేదీకి మూడు రాజధానుల ప్రకటన చేసి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగసభను ఉదయం 11 గంటల నుంచి నిర్వహించాలని తీర్మానించారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్‌లు, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 


ఇతర కారణాలను పక్కన పెట్టాలి 

ఈ ఉద్యమం ప్రత్యేకమైనది. ఇక్కడ భూమి ఇచ్చిన రైతులు పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం భయపడుతుంది. చివరికి రైతులపైనే రాళ్లు వేయించింది. కేంద్ర హోంమంత్రి ఫోన్‌ చేసి రాజధానిని అమరావతిలోనే ఉంచాలని జగన్‌కు చెప్తే నిలబడి తల ఊపుతాడు. ఆ పని బీజేపీ నేతలు ఎందుకు చేయడం లేదు? - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి


ఉద్యమానికి మంచి ఫలితాలు

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం విజయం సాధిస్తే మనమూ విజయం సాధించనట్టే. అమరావతి పరిరక్షణ సమితి ఒకరినే భుజాన వేసుకుంటే కష్టం. అందరితోనూ కలిసి సన్మార్గంలో నడిస్తేనే ఆ ఫలితాలను సాధిస్తాం. ఉద్యమమార్గం స్పష్టంగా ఉండాలి.     - పి.మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


రెండు నగరాలనూ పోరాటకేంద్రాలుగా మార్చాలి 

రాజధానిలో ఉన్న 29 గ్రామాల ప్రజలు, రైతులే ఆందోళనలు, ధర్నాలు చేయడం సరికాదు. రాజధాని ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలను పోరాట కేంద్రాలుగా తయారు చేయాలి. ఉద్యమంలోకి రైతు, కార్మిక, విద్యార్థి సంఘాలు రావాలి. న్యాయస్థానాల్లో వాజ్యాలపై ఆశలు పెట్టుకుని కూర్చోవడం సరికాదు. - లక్ష్మీనారాయణ, రాజకీయ విశ్లేషకుడు


నిర్వీర్యం చేసేందుకు కుట్ర

రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి మనల్ని తెలంగాణకు బానిసలను చేద్దామనుకుంటున్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ట్రాప్‌ల ప్రభుత్వం.  ఇలాంటి ట్రాప్‌లకు సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటే ముందుకు అడుగు వేయలేం. అమరావతి విశిష్టతను రాష్ట్రానికి వివరించాలి.  - పువ్వాడ సుధాకర్‌, రైతు ఐక్య కార్యాచరణ సమితి నేత


దక్షిణాఫ్రికాలోనూ ఒకటే రాజధాని 

మూడు రాజధానుల విషయంలో దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. దక్షిణాఫ్రికా ఒక దేశం. అందులో తొమ్మిది రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రానికీ ఒకటే రాజధాని . దేశానికి మూడు రాజధానులున్నా, ఖర్చు తడిసి మోపెడవుతోందని 2009లో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. - జంధ్యాల శంకర్‌, మాజీ మేయర్‌


ప్రజలను భాగస్వాములను చేయలేకపోయాం 

అమరావతి ఉద్యమాన్ని 29 గ్రామాల ఉద్యమంగా సీఎం జగన్‌ చిత్రీకరించారు. ఈ ఉద్యమంలోకి ప్రజలను భాగస్వాములను చేయలేకపోయాం. ఈనెల 17వ తేదీన అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం. - శ్రీనివాసరెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు



మా భుజాలపై వేసుకున్నాం 

అమరావతి ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన భుజాలపై వేసుకుంది. ఉద్యమం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమైతే కష్టం. మోదీలో చలనం కలిగేలా ఉద్యమ ఉధృతిని పెంచాలి. దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలి. ఒక్క అమరావతిలోనే ఉద్యమం కొనసాగితే ఏనుగు మీద వడగండ్ల వాన పడినట్టే ఉంటుంది.  - మస్తాన్‌ వలీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు


వైద్యులను బెదిరిస్తున్నారు 

రాజధాని ఉద్యమం ఆరంభమైనప్పుడు వైద్యులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత వారిని ఉద్యమంలోకి రాకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ఆస్పత్రుల వైద్యులను ఇబ్బంది పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఈ వ్యవహారం వైద్యులకు, కలెక్టర్‌కు మధ్య చాలా దూరమెళ్లింది. - డాక్టర్‌ కళాధర్‌, వైద్యుడు


మాట మార్చడం సరికాదు

అమరావతిలో రాజధాని ఉంటుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ మాట మార్చడం సరికాదు. ఆనాడే ఈ మాట చెప్పి ఉంటే ఇప్పుడింత గందరగోళం ఉండేది కాదు. అన్ని వర్గాలూ బాగానే ఉన్నాయి. కేవలం రాజధానిలో ఉన్న రైతులే పాడైపోయారు.   వెలగపూడి గోపాలకృష్ణ


సీఎం ఆలోచనలు అమరావతిపైనే 

 ముఖ్యమంత్రి జగన్‌ అనుక్షణం అమరావతి ఉద్యమం గురించే ఆలోచిస్తున్నాడు. అందువల్లే కౌంటర్‌ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఈ ఉద్యమం ఆయనలో ఒక ఆందోళనను రేపుతోంది. ఈ కారణంగానే నిరసన శిబిరాల వద్ద పోలీసు వలయాలను ఏర్పాటు చేస్తున్నారు. జేఏసీ అన్ని పక్షాలను ఒకేలా చూడాలి.  - వర్ల రామయ్య, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు


ఉద్యమంలోకి రావడం లేదు 

రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించినప్పుడు అన్ని రాజకీయ పక్షాల నాయకులు వస్తున్నారు. అదే రోడ్డెక్కి ఉద్యమం చేద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. అమరావతి పరిరక్షణ సమితి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. అమరావతి ఒక్కటే అంతిమ లక్ష్యంగా ఉంటేనే ప్రతిఫలం వస్తుంది.  డాక్టర్‌ శైలజ, జేఏసీ నేత

Updated Date - 2020-12-11T07:06:12+05:30 IST