జిల్లాలో 11.33 లక్షల రైస్‌ కార్డుల క్లస్టర్‌ మ్యాపింగ్‌ పూర్తి!

ABN , First Publish Date - 2020-12-06T06:00:10+05:30 IST

జిల్లాలో రైస్‌ కార్టుల మ్యాపింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా 12,69,191 రైస్‌ కార్డులకు, 11,33,807 రేషన్‌ కార్డుల మ్యాపింగ్‌ పూర్తయింది.

జిల్లాలో 11.33 లక్షల రైస్‌ కార్డుల క్లస్టర్‌ మ్యాపింగ్‌ పూర్తి!

విజయవాడ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రైస్‌ కార్టుల మ్యాపింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా 12,69,191 రైస్‌ కార్డులకు, 11,33,807 రేషన్‌ కార్డుల మ్యాపింగ్‌ పూర్తయింది. సచివాలయాల పరిధిలో గ్రామ, వార్డు వలంటీర్ల పరిఽధిలో ఉండేలా మ్యాపింగ్‌ చేస్తున్నారు. దీంతో జనవరి నుంచి ఇంటింటికీ సార్టెక్స్‌ రైస్‌తో పాటు, నిత్యావసరాల పంపిణీ సులువు అవుతుంది. ఇప్పటి వరకు కార్డు ఒక చోట, డీలర్‌ మరో చోట, వలంటీర్‌ వేరేచోట ఉన్నారు. ఈ మ్యాపింగ్‌తో ఏ వలంటీర్‌ పరిధిలోని కార్డు అదే వలంటీర్‌ పరిధిలోకి వస్తుంది. విజయవాడ డివిజన్‌ పరిధిలో 14.31 శాతం, మచిలీపట్నం డివిజన్‌లో 8.31 శాతం, గుడివాడ డివిజన్‌లో 8.90 శాతం, నూజివీడు డివిజన్‌లో 6.67 శాతం బియ్యం కార్డుల క్లస్టర్‌ మ్యాపింగ్‌ పూర్తి కావాల్సి ఉంది. దీనికి సంబంధించి జేసీ-2 ఎల్‌ శివశంకర్‌ రెవెన్యూ డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం విజయవాడ డివిజన్‌ పరిధిలో సమీక్షించారు. సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, డివిజినల్‌ ఏఎస్‌ఓ విలియమ్స్‌, సర్కిల్‌-2, సర్కిల్‌ - 3 ఏఎస్‌ఓ కోమలి పద్మ, వెస్ట్‌ తహసీల్దార్‌ ఎం మాధురి సమావే శంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ-2 మాట్లాడుతూ నివాస గృహాల క్లస్టర్‌ మ్యాపింగ్‌లో సమస్యలుంటే తక్షణం అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. బియ్యం కార్డులు కలిగిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని ఆ ప్రాంతాల్లో మ్యాపింగ్‌కు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. డివిజన్‌ పరిధిలో 5,68,467 రైస్‌ కార్డులకు గాను 4,87,144 రైస్‌ కార్డులను మ్యాపింగ్‌ చేసినట్టు సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర తెలిపారు. ఇంకా 81,323 రైస్‌ కార్డుల మ్యాపింగ్‌ చేయాల్సి ఉందన్నారు. విజయవాడ అర్బన్‌ పరిధిలో 52,980 కార్డులు మ్యాపింగ్‌ చేయాల్సి ఉందని, నివాసిత ప్రాంతాల్లో కార్డుదారుల ఆచూకీ లేనందున వారు ఎక్కడున్నదీ గుర్తించి ఆయా ప్రాంతాల్లో కార్డుల క్లస్టర్‌ మ్యాపింగ్‌ పూర్తి చేసే పనిలో వలంటీర్లు ఉన్నారని వివరించారు.

Read more