-
-
Home » Andhra Pradesh » Krishna » rice cards krishna district officers
-
ట్యాగింగ్.. రన్నింగ్!
ABN , First Publish Date - 2020-11-25T06:17:05+05:30 IST
బియ్యం కార్డుల జియోట్యాగింగ్ ప్రక్రియ రెవెన్యూ..

బియ్యం కార్డుల జియో ట్యాగింగ్ పరేషాన్
అధికారులకు ‘డెడ్’లైన్!
పనిచేయని సర్వర్.. అధికారులు పరుగులు
ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం హడావుడి
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: బియ్యం కార్డుల జియోట్యాగింగ్ ప్రక్రియ రెవెన్యూ అధికారులను, సచివాలయ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తోంది. జనవరి ఒకటో తేదీ నుంచి ఇళ్ల వద్దే రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నందున కార్డుల జియోట్యాగింగ్ అధికారులకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. మంగళవారం సాయంత్రంలోగా ఈ ప్రక్రియను నూరుశాతం పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో ఆర్డీవోలు, తహసీల్దార్లు, వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు పరుగులు పెట్టారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుల జియోట్యాగింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, 80 నుంచి 90 శాతం వరకు ఈ ప్రక్రియ పూర్తయింది. ఆన్‌లైన్ సహకరించకపోవడంతో మిగిలిన పని ఆగిపోయిందని, అయినా ఉన్నతాధికారులు వేగంగా పూర్తి చేయాలంటూ వెంటపడుతున్నారని రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు వాపోతున్నారు.
15 శాతం అడ్రసులు గల్లంతు
సచివాలయంలో పనిచేసే వలంటీర్లు తమకు కేటాయించిన గృహాలకు వెళ్లి బియ్యం కార్డులు జియో ట్యాగింగ్ చేసే సమయంలో కొందరి చిరునామా తెలియని పరిస్థితి. అద్దె గృహాల్లో ఉన్నవారు ఇళ్లు మారడం, కొంతమంది వేరే గ్రామాలకు వెళ్లడం, మరికొందరు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లడం తదితర కారణాలతో వారి వివరాలు, ఫోన్ నెంబర్లు దొరకడం లేదు. కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడున్నా, రేషన్ షాపుల్లో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు ఇప్పటి వరకు ఉండటంతో ఇబ్బందులు తలెత్తలేదు. కార్డులకు జియోట్యాగింగ్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తడం, నూరుశాతం బియ్యం కార్డులకు జియోట్యాగింగ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని రెవెన్యూ అదికారులు చెబుతున్నారు. ఇప్పటికే 80 నుంచి 90 శాతం వరకు బియ్యం కార్డులకు జియోట్యాగింగ్ పూర్తయిందని, మిగిలినవి చేయడానికి సమయం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు తమను హైరానా పెడుతున్నారని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. కార్డులకు జియోట్యాగింగ్ ఉంటేనే సరుకులు ఇస్త్తామని నిబంధన పెడితే కార్డుదారులు ఎక్కడ ఉన్నా వచ్చి, జియోట్యాగింగ్ చేయించుకుంటారని, ఇదేమీ పట్టించుకోకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
12 లక్షలకు పైగా కార్డులు
జిల్లాలో బియ్యం కార్డులు 12 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జిల్లాలో బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందిస్తామని చెప్పారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. 2021 జనవరి నుంచి ఇంటికే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సచివాలయాల్లోని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా బియ్యం కార్డుదారుల ఇళ్లకు వెళ్లి, వేలిముద్రలు సేకరించి, జియో ట్యాగింగ్ ద్వారా వివరాలు నమోదు చేశారు. ఈ వివరాలన్నింటినీ తహసీల్దారు కార్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఆన్‌లైన్ సక్రమంగా పనిచేయక పోవడంతో ఈ ప్రక్రియ ఇంత వరకు పూర్తికాలేదు.